calender_icon.png 24 November, 2024 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్య్స రంగంలో ఉజ్వల భవిష్యత్తు

24-11-2024 12:00:00 AM

  1. పెబ్బెరులో ఏకైక మత్య్స కళాశాల 
  2. ఎంసెట్ మెరిట్ ఆధారంగా సీట్లు 

పెబ్బేర్, నవంబర్ 23: మత్య్స రంగాన్ని అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం రాష్ట్రంలోనే తొలి మత్య్స కళాశాలను వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసింది. చేపల పెంపకంపై పరిశోధనలు చేసేందుకు సౌకర్యవంతమైన వసతులు కల్పించింది. మత్య్స కళాశాలలో డిగ్రీ చదివి పీజీ, పీహెచ్‌డీలు చేసే అవకాశాలు సైతం ఉన్నాయి.

ఎంసెట్ మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఇక్కడి కోర్సులకు ఎంపిక చేస్తున్నారు. నాలుగేండ్లు కోర్సు కోసం ఏటా 25 మంది విద్యార్థులకు అవకాశం ఉంటుంది. మొదటి మూడేండ్లు ఆక్వా కల్చర్, ఆక్వెటిక్ యూనిమల్ హెల్త్ మేనేజ్‌మెంట్, ఆక్వాటిక్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఫిషరిస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి మత్య్సరంగ కోర్సులుంటాయి.

నాలుగో ఏడాది పాలేరులోని మత్య్స పరిశోధన కేంద్రానికి పంపించి శిక్షణ ఇస్తారు. అనంతరం డూయింగ్ అండ్ ఎర్నింగ్ విధానంలో పనిచేస్తూ పారిశ్రామిక అభివృద్ధిలో విద్యార్థులు పాలు పంచుకుంటారు. 

మత్య్సశాఖలో ఉపాధి అవకాశాలు

మత్య్సశాఖలో అభివృద్ధి అధికారులుగా, ఫిషరిస్ ఇన్‌స్పెక్టర్లుగా ప్రభుత్వ కొలువులు పొందవచ్చు. వీటితో పాటు బ్యాంకింగ్ రంగంలో టెక్నికల్ ఫీల్డ్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

శాశ్వత కళాశాల భవనం 

పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్యశాలకు అనుబంధంగా పెబ్బేర్ మున్సిపా లిటీ పరిధిలో మత్య్స కళాశాలను ఏర్పాటు చేశారు. 2017లో దాదాపుగా 27.5 ఎకరాల్లో హాస్టల్, క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. కళాశాల భవన నిర్మాణ పనులు దాదాపుగా 70 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. 

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా.. 

విద్యార్థులకు మత్య్స రంగంలో ఉజ్వల భవిష్యత్తు ఉంది. మత్య్స రంగం దినదినాభివృద్ది చెందుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలో ఏకైక కళాశాల కావడంతో సీట్లు పెంచే ఆలోచన ఉన్నది. 

 డాక్టర్ నాగలక్ష్మి, అసోసియేట్ డీన్, మత్య్స కళాశాల, పెబ్బేర్