20-03-2025 07:15:30 PM
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ ధనీష్ అబ్దుల్ ఖాదర్..
సంగారెడ్డి (విజయక్రాంతి): పరిశ్రమకు అవసరాలకు తగ్గట్టు ఏరోస్పేస్ ఇంజనీరింగ్(Aerospace Engineering) విద్యార్థులు నైపుణ్యాలను అలవరచుకుంటే, ఆ రంగంలోనే లెక్కకు మిక్కిలిగా ఉపాధి అవకాశాలున్నాయని బెంగళూరులోని ఎస్ఎస్ టెక్నాలజీస్ స్పేస్ సిస్టమ్స్ ఇంజనీర్ ధనీష్ అబ్దుల్ ఖాదర్(Space Systems Engineer Dhanish Abdul Khader) అన్నారు. గురువారం పటాన్ చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ(Geetam School of Technology)లోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘ఏరోనాటిక్స్, స్పేస్, డిఫెన్స్ లో విజయవంతంమైన కెరీర్ కోసం డిజైన్ ఇన్నోవేషన్’ అనే అంశంపై ఆతిథ్య ఉపన్యాసం చేశారు.
చైనా ఉత్పత్తులు, యాప్ లపై భారత ప్రభుత్వం నిషేధం విధించాక స్వదేశీ ఉత్పత్తికి ముందుకు రావడం ఏరోస్పేస్, రక్షణ రంగాలలో గణనీయమైన అవకాశాలను సృష్టించిందని ధనీష్ చెప్పారు. విశ్వవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ కంపెనీలు తామే స్వయంగా, లేదా భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో భారతదేశంలో తయారీ యూనిట్లను స్థాపించడాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. రక్షణ రంగ పరిశోధన అభివృద్ధి సంస్థ (Defence Research and Development Organisation), దాని అనుబంధ సంస్థలు దేశీయంగా రక్షణ ఉత్పత్తులను ఆవిష్కరించడానికి, తయారు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తోందని ధనీష్ చెప్పారు.
రానున్న ఐదేళ్లలో రక్షణ రంగంలో పరిశోధన, ఆవిష్కరణల కోసం దాదాపు రూ.499 కోట్ల బడ్జెట్ ఆమోదించినట్టు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Defence Minister Rajnath Singh) ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సాంకేతిక భాగస్వామ్యం ద్వారా మనదేశంలో రక్షణ ఉత్పత్తుల ఉత్పత్తిని సులభతరం చేయడానికి ప్రభుత్వం ఇతర దేశాలతో అనేక అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా రక్షణ కారిడార్లు, ఏరోస్పేస్ పార్కులు నెలకొల్పుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. బోయింగ్, ఎయిర్ బస్, లాక్ హీడ్ మార్టిన్, సఫ్రాన్ వంటి ప్రముఖ ఏరోస్పేస్, రక్షణ సంస్థలతో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
గుజరాత్లో ప్రతిపాదిత ఎయిర్ బస్-టాటా విమానాల తయారీ సౌకర్యం, రక్షణలో భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని (ఎఫ్డీఐ) పొందే ధీరూభాయ్ అంబానీ ఏరోస్పేస్ పార్క్(Dhirubhai Ambani Aerospace Park), హైదరాబాద్ లో తయారవుతున్న బోయింగ్ విడిభాగాలు, జీఎంఆర్ ఏరోస్పేస్ పార్కులో దేశంలోనే అతిపెద్ద విమాన ఇంజన్ నిర్వహణ, మరమ్మతు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్వో) సౌకర్యాన్ని ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్ ఏర్పాటు చేయడం, ఏరోస్పేస్-రక్షణ రంగ తయారీకి ప్రధాన కేంద్రంగా తెలంగాణ ఎదుగుతున్న కీలక పరిణాలను ధనీస్ వివరించారు. ఈ పరిణామాలు ఏరోస్పేస్, రక్షణ రంగాలలో నైపుణ్యం కలిగిన నిపుణులకు పెరుగుతున్న డిమాండ్ ను సూచిస్తోందని చెప్పారు. తొలుత, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ ఎండీ.అక్తర్ ఖాన్ అతిథిని పరిచయం చేసి, సత్కరించారు. ఈ ఉపన్యాస కార్యక్రమంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.