calender_icon.png 25 September, 2024 | 3:48 PM

ఉద్యమాలకు వారధి

25-09-2024 12:00:00 AM

‘లాఠీలు, తూటాలు, జైళ్లు, ఎస్మా చట్టాలు.. ఏ ఒక్కటీ కూడా తెలంగాణ ఉద్యమాలను ఆపలేకపోయాయి’ అంటారు ఉద్యమకారుడు కందిమళ్ల ప్రతాప్ రెడ్డి. నల్లగొండలో ఓ మారుమూల గ్రామంలో జన్మించిన ఆయన ప్రస్థానం పోరు తెలంగాణ నుంచి వేరు తెలంగాణ వరకు సాగింది.

తెలంగాణలో జరిగినా మూడు ఉద్యమాలకు వారధి ఆయన. తెలంగాణ బిడ్డగా, రచయితగా, ఉద్యమకారుడిగా తొమ్మిది దశబ్దాల ప్రయాణాన్ని విజయక్రాంతితో పంచుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం ఎగసిన తొలి దశ ఉద్యమం గురించి ఆయన మాటాల్లోనే..     

ప్రత్యేక తెలంగాణ నినాదం ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు నుండే ఉండే. ఫజలలీ కమిషన్ ఏర్పాటు చేసే నాటికే తెలంగాణలో విశాలాంధ్ర అనుకూల, వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అయితే తెలంగాణలో బలమైన శక్తిగా ఉన్న ఆనాటి పార్టీలు, తెలుగు భాషాభిమానులైన మాడపాటి హనుమంతరావు, కాళోజి, కోదాటి నారాయణ రావు, దేవులపల్లి రామానుజరావు, దాశరథి, వట్టికోట ఆళ్వారుస్వామి మొదలైన వాళ్ళంతా మొదట్లో విశాలాంధ్రకు సపోర్టు చేసినా, కాలక్రమంగా తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిండ్రు.

కాంగ్రెసులోని మెజారిటీ వర్గం ప్రత్యేక తెలంగాణ కావాలవడంతో. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ ఉద్యమం మొదలైంది. విశాలాంధ్ర ఏర్పడితే ఉద్యోగ నియమకాలు, ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి విషయాలలో తమకు న్యాయం జరగదని ఫజలలీ కమిషన్‌కు తమ వాదనను వినిపించారు. తెలంగాణ ప్రజలలో ఉన్న అనుమానాలు, భయందోళనలు నివృత్తి చేయడానికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక హామీలతో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 

నెహ్రూ హామీ..

1956 మార్చి ఐదోవ తారీకున నిజామాబాద్ బహిరంగసభలో జవహర్‌లాల్ నెహ్రూ మాట్లాడుతూ.. ‘ఒక అమాయక అమ్మాయి పెండ్లి పిల్లవాడితో జరుగుతున్నది. ఒకవేళ ఆంధ్ర ప్రాంతాల వారు కలిసి ఉండే అవకాశం లేకపోతే, కొంతకాలం తర్వాత విడాకులతో విడిపోవచ్చు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రజలకు ప్రాధాన్యం ఉండాలి. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని పొందాలి’ అన్నాడు. 

మొదటి నుంచి ఉల్లంఘన

1956 నవంబర్ ఒకటోవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజు ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి నిజాం కళాశాల ఎదురుగా ఉన్న ఫతేమైదాన్ గ్రౌండ్స్‌లో ప్రమాణ స్వీకారం చేశాడు. తెలంగాణకు ఇవ్వల్సిన ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాకుండా, ఉపముఖ్యమంత్రి పదవి.. చేతికి ఆరవ వేలు లాంటిది, అనవసరమని ఆ పదవిని రద్దు చేశాడు. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి రోజునే ఒప్పందం ఉల్లంఘన మొదలైందని తెలంగాణవాదులు భావించారు.

1960 నాటికి తెలంగాణ ఉద్యోగులు, విద్యార్థుల్లో అలజడి ప్రారంభమయింది. తెలంగాణ ప్రాంతీయ కమిటీ, తెలంగాణ మిగులు నిధులు ఆంధ్ర ప్రాంతంలో ప్రమేయం లేకుండానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ప్రాంతీయ కమిటీ చైర్మన్ అచ్యుత్‌రెడ్డి గణాంకాలు బయటపెట్టాడు. అప్పటిదాక ఉన్న అసంతృప్తి కాస్త ఉద్యమరూపం దాల్చింది. 

ప్రాజెక్టుల విషయంలో..

నందికొండ, పోచంపాడు వంటి అతి ముఖ్య ప్రాజెక్టులను ఖరారు చేసి వాటిని నిర్మించాలని హైదరాబాద్ ప్రభుత్వం తలపెట్టింది. విశాలాంధ్రలో తమ ప్రయోజనం నిర్లక్ష్యం అవుతుందేమోనని భయం ఎక్కడో ఓ మూలన తెలంగాణ వాదులకు ఉంది. నాగార్జున సాగర్ నిర్మాణంలో ఆ భయం నిజమయ్యింది. ప్రాజెక్టు డిజైన్, స్థలం మార్చివేసి ఎడమ కాలువకు కేటాయించిన 132 టీఎంసీ నీళ్లు, 106 టీఎంసీలకు కుదించడమేగాక, కాలువను ఆంధ్ర ప్రాంతానికి పొడిగించి, తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారు.

విద్యార్థుల్లో అసంతృప్తి

1967 నాటికి ఒప్పందానికి భిన్నంగా జరిగిన అంశాలను తెలంగాణ ప్రాంతీయ సమితి ప్రకటించింది. తెలంగాణ ప్రాంతానికి చెందవలసిన నాలుగు వేల ఉద్యోగాల్లో బయటి వారిని నియమించారని, 81 కోట్ల తెలంగాణ నిధులు ఖర్చు పెట్టలేదని, హైదరాబాద్ రాష్ట్రం రూపొందించిన పోచంపాడు, నందికొండ ఇతర ప్రాజెక్టుల రూపురేఖలు మారిపోయాయి, కొన్ని ప్రాజెక్టులు సైజులు తగ్గిపోయి నిర్మాణం కాకుండా నిలిచిపోయాయని ప్రకటించారు.

1969 నాటికి తెలంగాణ ప్రజల్లో ముఖ్యంగా విద్యార్థి, యువకుల్లో వచ్చిన అసంతృప్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యమరూపం దాల్చింది. ఆ సందర్భంలో ఒప్పందానికి భిన్నంగా జరిగిన అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ ఉద్యమంలో వందలాది మంది యువకుల ప్రాణాలు కోల్పోయారు. 

ముఖ్యమంత్రి పదవి తొలగింపు..

ఆ తర్వాత రెండేళ్లకు 1972లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని ఆంధ్ర ప్రాంతంలో ‘జై ఆంధ్ర’ ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఉద్యమానికి కారణాలు తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు చట్టపరమైనవని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న పీ.వీ.నరసింహారావు భూ సంస్కరణలు పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు ప్రవేశపెట్టారు.

అలా ఒక సంవత్సరం పాటు సాగిన ఉద్యమంలో ఆంధ్ర రాయలసీమ ప్రాంతం అట్టుడికింది. చివరికి ఆరు సూత్రాల పథకంతో పీ.వీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఉద్యమం ఆగిపోయింది. భూసంస్కరణల చట్టం మూలపడింది. 

వేలాదిమంది అసువులు బాశారు!

దాదాపు నాలుగు దశాబ్దాల వరకు ఒప్పందాల ఉల్లంఘనలు జరుగుతూనే వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ వాదం ఏదో మేర వినబడుతూనే వచ్చింది. చివరికి అది మహోద్యమంగా మారింది. హక్కులు, రక్షణల ఉల్లంఘనే కాదు తెలంగాణ ప్రాంత చరిత్ర, త్యాగాలను విస్మరించారని ఆందోళనలు చేశారు. ఈ ఉద్యమంలో  తెలంగాణ బిడ్డలు అసువులు బాశారు. వేలాదిమంది లాఠీ తూటాలను కటకటాలను భరించారు. వారి దీక్ష, పోరాటం, త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.  

భౌగోళిక విభజనే..

తెలంగాణ ఉద్యమం ఆంధ్ర, రాయలసీమ ప్రజలకు వ్యతిరేకమేం కాదు. భారతపౌరులుగా ఎవరు ఎక్కడైనా ఉండే హక్కును కాదనే హక్కు ఎవరికీ లేదు. తెలంగాణ ప్రజలు కోరుతున్నది రాజకీయంగా పాలనా పరమైన భౌగోళిక విభజన మాత్రమే. దీన్ని గమనించి అక్కడి ప్రజలు మద్దతు తెలిపారు. కొంతమంది వ్యాపారస్తులు మాత్రం ఉద్యమాన్ని లేవనెత్తారు.   

యాదిరెడ్డి మరణం..

ఈనాటి వరకు వేయిమందికి పైగా యువకులు ‘తెలంగాణ రాష్ట్రం’ కోసం ప్రాణాలు అర్పించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మహత్య చేసుకునే ముందు యాదిరెడ్డి రాసిన లేఖ మనిషన్న వాడినెవడినైనా కదిలిస్తుంది. మనసున్న వాడికెవడికైనా ఉద్యమ ఉధృతి అర్థమవుతుంది. ప్రజల ఆకాంక్ష వ్యక్తమవుతుంది.

అన్నీ ప్రాణాలు పోతున్నా ఆనాటి నాయకులకు చలనమెందుకు లేదు? కలిసి ఉండాలనే వారి కర్రపెత్తనం వెనుక దాగిన రహస్యమేమిటి? అంగబలం, అర్ధబలం, అధికార బలమా! హైదరాబాద్ వారి అడ్డ, అన్ని దందాలు ఇక్కడే, సెజ్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, విలాస కేంద్రాలు, అక్రమ దస్తావేజులతో భూకబ్జాలు వాటిని కాపాడుకునే తాపత్రయం తప్ప ప్రజల శ్రేయస్సు కాదు. 

అన్నదమ్ములుగా విడిపోదాం! 

తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మధ్య ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవాలంటే తెలంగాణ ప్రజల గుండెలు మండవా? వీర తెలంగాణ చరిత్రను నలుదిశలకు వ్యాప్తి చేసిన తెలంగాణ నాయకుల విగ్రహాలు ఎక్కడైనా వున్నాయా? తెలంగాణ ప్రజల త్యాగాలకు, చరిత్రకు అవమానం జరిగినప్పుడు అన్ని రంగాల్లో అక్రమాలు జరిగినప్పుడు ‘మా రాష్ట్రం కావాలి.. మా పాలన మాకు కావాలి, అన్నదమ్ముల్లా విడిపోదాం ఆత్మీయులుగా ఉందాం అంటే తప్పేమిటి?’ అని సీపీఐలో అడిగిన మొట్టమొదటి వ్యక్తిని నేను. ఆ విషయంలో ఇప్పటికీ గర్విస్తాను. 

దోపిడీదారులకు వ్యతిరేకం..

ఉద్యమకాలంలో తెలంగాణ ప్రాంత నాయకులు ఆంధ్రా వారిపై రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా తెలంగాణ ప్రజలు వాటిని పట్టించుకోలేదు. రెచ్చిపోలేదు. తమ పోరాటం ఆంధ్రప్రాంత ప్రజలకు వ్యతిరేకం కాదు, దోపిడీదారులకు వ్యతిరేకమని,  తాము కోరుకునేది భౌగోళిక తెలంగాణ తప్ప, తెలుగు ప్రజల మధ్య విభజన కాదని పదేపదే తేల్చి చెప్పారు. ఉభయరాష్ట్రాల తెలుగు ప్రజలు రాష్ట్రాలుగా విడిపోయినా, ఆత్మీయులుగా కలిసి ఉందామనుకున్నాం.

ముక్కోటి తెలుగు ప్రజలు ఒకటి కావాలని, విశాలాంధ్రలో ప్రజారాజ్యం స్థాపించాలని ఆనాడు మాలాంటి వాళ్ళమంతా కోరుకున్నాం. ఉద్యమం కూడా చేశాం. ఫలితంగా ఏమి జరిగిందో కూడా చూశాం. దీనికి బాధ్యులు పాలకవర్గం, దోపిడిదారులు తప్ప ఆంధ్ర, తెలంగాణ ప్రజలు కారు. వారి మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు. వ్యతిరేకత లేదు. భౌగోళికంగా రాష్ట్రాలు రెండైనా అనురాగం, స్నేహం, బంధుత్వం చెదరిపోలేదు. 

 రూప