calender_icon.png 24 September, 2024 | 4:48 AM

కాంగ్రెస్‌లోకి వలసలకు బ్రేక్?

24-09-2024 02:34:10 AM

హైకోర్టు తీర్పుతో పార్టీ మార్పుపై నేతల సమాలోచనలు

  1. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హత భయం
  2. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో హస్తం?
  3. ఘర్ వాపసీకి గులాబీ అధినేత యత్నాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి వలసలు జోరందుకోగా.. తాజాగా హైకోర్టు తీర్పుతో వాటికి బ్రేక్ పడింది. పార్టీ ఫిరాయించిన స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావులపై దాఖలు చేసిన అనర్హత వేటుపై విచారణ షెడ్యూల్‌ను రూపొందించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం పడినట్లుంది.

బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేల్లో 26 మందిని తమవైపు తిప్పుకొని బీఆర్‌ఎస్‌ఎల్పీని సీఎల్పీలో విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ భావించింది. అందు లో భాగంగా బీఆర్‌ఎస్‌కు చెందిన 10 మం ది ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకుంది. మరో 16 మంది చేరికతో విలీనాన్ని పూర్తి చేయాలని అధికార కాంగ్రెస్ ప్లాన్ వేయగా బెడిసికొట్టినట్లుంది. పార్టీ ఫిరాయింపులపై హైకో ర్టు సింగిల్ బెంచి ఇచ్చిన తీర్పుతో ప్రధాన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సింగి ల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లాలనే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం.

కొత్తగా చేరే వారిపై ప్రభావం!

తమ అక్రమాస్తులను కాపాడుకునేందు కు గ్రేటర్‌కు చెందిన నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలోనే అధికార పార్టీలోకి చేరుతారని తెలంగాణ భవన్‌లో జోరుగా ప్రచారం జరిగింది. ఇంతలోనే హైకోర్టు తీర్పు రావడంతో వారంతా సొంతపార్టీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. 

రివర్స్‌గేర్‌కు గులాబీ బాస్ యత్నాలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, వారిలో ఐదారుగురు ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకునేందుకు గులాబీ బాస్ కేసీఆర్ చక్రం తిప్పుతున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. వీరితో పాటు అధికార పార్టీలోనే సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా ఉన్న వర్గం వారితో రహస్య మంతనా లు జరిపి మరికొందరిని బీఆర్‌ఎస్‌లోకి లాగి ప్రభుత్వాన్ని సందిగ్ధంలోకి నెట్టాలని ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. వారు పార్టీలోకి రావడానికి అంగీకరిస్తే కోట్ల రూపా యలు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నట్లు చర్చ సాగుతోంది. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తారని ప్రచారం జరుగుతుంది.

బీఆర్‌ఎస్ ద్వంద్వ వైఖరి..

రాష్ట్రంలో రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్‌ఎస్  ఇతర పార్టీల ఎమ్మెల్యేల ను తమ పార్టీలోకి చేర్చుకుంది. మొదటి విడతలో టీడీపీ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యేతో పాటు శాసనమండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నారు. అసెంబ్లీలో టీడీపీఎల్పీని, శాసన మండలిలో కాంగ్రెస్ ఎల్పీని బీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసుకున్నారు. రెండోసారి అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌కు చెంది న 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకొని, అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.

కాంగ్రె స్ అధికారంలోకి వచ్చిన వెంటనే బీఆర్‌ఎస్‌పై రాజకీయ ప్రతికారం తీర్చుకో వాలనే పట్టుదలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు. అందుకే బీఆర్‌ఎస్ నుంచి కాం గ్రెస్‌లోకి వలసలను ప్రోత్సహించారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. అయితే  బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి సొంత గూటికి వెళ్తారనే ప్రచారం జరుగుతుంది.