* 56 గంటలపాటు నరకయాతన
* రాజస్థాన్‌లోని దౌసాలో ఘటన
దౌసా, డిసెంబర్ 12: రాజస్థాన్‌లోని 150 అడుగుల లోతు ఉన్న బోరుబావిలో పడిపోయిన బాలుడు ఆర్యన్(5) మృతి చెందాడు. దాదాపు 56 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి బాలుడిని బయటకు తీసి హాస్పిట్‌కు తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. దౌసా జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటిపక్కనే ఉన్న 175 అడుగుల బోరుబావిలో ఆర్యన్ అనే బాలుడు పడిపోయాడు. వెంటనే కుటుంబసభ్యులు అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అధికారులు చేరుకుని కలెక్టర్ దేవేంద్ర యాదవ్ నేతృత్వంలో సహాయక చర్యలు ప్రారంభించాయి.
మొదట ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్టీఆర్‌ఎఫ్ బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా బాలుడిని బయటకు తీయడానికి ప్రయత్నించాయి. అయితే ఫలితం లేకపోవడంతో బోరుబావికి 4 నుంచి 5 అడుగుల దూరంలో పైలింగ్(డ్రిల్లింగ్) మిషన్‌తో 4 అడుగుల వెడల్పుతో అధికారులు గొయ్యి తవ్వారు. బుధవారం దాదాపు 150 అడుగుల తవ్వకం పూర్తయిన తరువాత ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందులోకి దిగి సొరంగం తవ్వి బాలుడిని కాపాడారు. అయితే అప్పటికే బాలుడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. కానీ అప్పటికే ఆర్యన్ చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు.