calender_icon.png 5 October, 2024 | 4:51 AM

దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాలి

05-10-2024 12:36:25 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులు పండించే ప్రతి క్వింటా ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చడం సరికాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. సన్నవడ్లకే కాకుండా దొడ్డు రకానికి కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు.

సీఎం, మంత్రులు నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో దొడ్డ వడ్లకు బోనస్, వానాకాలం రైతు భరోసాపై మాట్లాడకపోవడం దారుణమని మండిపడ్డారు.  కేవలం సన్నవడ్లకే బోనస్ అంటూ సీఎం మాట్లాడటంతో రైతులు ఆందోళన చెందుతున్నార న్నారు. రాష్ట్రంలో 80 శాతం రైతులు దొడ్డు వడ్లే పండిస్తారని, ఈ సంగతి తెలిసే కాంగ్రెస్ పాలకులు కేవలం సన్నాలకు బోనస్ ప్రకటించారన్నారు.

రైతులందరికీ బోనస్ ఇవ్వాలని, లేని పక్షంలో రైతుల పక్షాన పోరాటానికి సిద్ధమన్నారు. రైతు భరోసా పేరిట ఎకరాకు రూ.7,500 ఇస్తామని స్వయంగా పీసీసీ హోదాలో సీఎం ప్రకటించారని, ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వకపోవడం సరికాదన్నారు. రైతులకు నాట్లు వేసే నాటికి వేయాల్సిన పెట్టుబడి సాయం పంట         చేతికొచ్చే వరకు కూడా ఇవ్వకపోవడం రైతుల పట్ల ఈప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

రుణమాఫీపై సీఎం పచ్చి అబద్ధాలు

రాష్ట్రంలో వంద శాతం రైతు రుణ మాఫీ సీఎం రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ డిసెంబర్ 9న ఏకకాలంలో మాఫీ చేస్తామని దగా చేశారన్నారు.

అధికారిక లెక్కల ప్రకారం 2 లక్షల రుణమాఫీ పూర్తికానీ రైతులు 20 లక్షలకు పైగా ఉన్నారని, అనాధికారికంగా ఇంకా ఎంతోమంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా రైతుబంధు డబ్బులను ఖాతాల్లో జమ చేయ లేదని మండిపడ్డారు.