- సన్నాలకు బోనస్ వైపే మొగ్గు చూపుతున్న రైతులు
- రైతులు కోరిన వాటినే సర్కార్ అమలు చేస్తుంది
- రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- చరిత్రలో నిలిచేలా ధాన్యం దిగుబడి: మంత్రి ఉత్తమ్
- అమిస్తాపూర్‌లో రెండోరోజూ ‘రైతుపండుగ’
- నేటి ముగింపు వేడుకకు సీఎం రేవంత్‌రెడ్డి
మహబూబ్‌నగర్, నవంబర్29 (విజయక్రాంతి): రైతుభరోసా కంటే ప్రభుత్వం సన్నాలకు ఇచ్చే రూ.500 బోనస్ బాగుందని రైతులంటున్నారని, పెట్టుబడిసాయం కంటే ఎకరాకు రూ.1,500 అందే బోనస్ వైపే వారు మొగ్గు చూపుతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
ప్రజపాలన విజయోత్స వాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలోని అమిస్తాపూర్‌లో శుక్రవారం నిర్వ హించిన రెండోరోజు ‘రైతుపండుగ’లో ఆయన మాట్లాడారు. తమప్రభుత్వం ఓట్ల రాజకీయాలు చేయదని, ప్రజల బాగోగుల కోసం మాత్రమే పనిచేస్తుందని తెలిపారు. తమకు ఏది మంచిదో రైతులే చెప్పాలని, వారు కోరిన వాటిని ప్రభుత్వం అమలుచేస్తుందని హామీ ఇచ్చారు.
రైతుల అభిప్రాయాలను నేరుగా వినేందుకే రైతు సదస్సును ఏర్పాటుచేశామని వెల్లడించారు. రైతులు కోరుకున్న పథకాలనే ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంచేశారు. రైతుల కోరుకుంటే రైతుభరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పాలమూరు కరువు జిల్లా అని, పేద జిల్లా అని ఇక ఎవ్వరూ అనకూడదన్నారు.
భవిష్యత్తులో రాష్ట్రానికి అన్నం పెట్టే జిల్లాగా పాలమూరు అవతరించాలని ఆకాంక్షించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయించాలని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. యాసంగి పంటకు నీళ్లెప్పుడు ఇస్తారో నిర్ణయించాలని సూచించారు. పాలమూరు జిల్లా పచ్చబడితే ఇక బీడు భూములు ఉండవని వ్యాఖ్యానించారు.
రైతులు ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. రైతులు సాగు ప్రారంభిస్తే జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మొదటి నాలుగేళ్ల పెట్టుబడిని ప్రభుత్వమే భరిస్తుందని, నాలుగు సంవత్సరాల తర్వాత అంతర పంట, ఇతర పంటలూ సాగు చేసి అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చన్నారు.
కాగా, శనివారం రైతుపండుగ ముగింపునకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతారని ప్రకటించారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జీ చిన్నారెడ్డి, ఎమ్మెల్యేలు జీ మధుసూదన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, తూడి మేఘా రెడ్డి, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, పర్ణికరెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు, కమిషనర్ గోపి, రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్, కలెక్టర్ విజయేంద్ర బోయి పాల్గొన్నారు
వరిసాగులో తెలంగాణ టాప్: మంత్రి ఉత్తమ్
వరి సాగులో తెలంగాణనే టాప్ అని, యావత్ దేశానికి అన్నంపెట్టే స్థాయికి రా ష్ట్రం చేరుకుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, ఇది రాష్ట్ర చరిత్రలో ఆల్ టైం రికార్డుగా నిలిచిపోతుందన్నారు.
ప్రభుత్వం దొడ్డు రకానికి మద్దతు ధర ఇస్తుందని, అలాగే సన్నా లకు మద్దతు ధరతోపాటు క్వింటాకు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తున్నదన్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్ర భుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి, వ్యవసాయ పక్షపాతి అని, రైతులకు మేలు జరిగే పథకాలనే అమలు చేస్తామని స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశామన్నారు. మిగిలిన రైతుల రుణమాఫీపై త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన విడుదల చేస్తారని తేల్చిచెప్పారు.
రైతుల కోసం రూ.54,280 కోట్లు
అధికారంలోకి వచ్చిన ఏడాది వ్యవధిలోనే తమ ప్రభుత్వం రైతుల కోసం రూ.54,280 వేల కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఈ నిధుల్లో రూ.10,444 వేల కోట్లు ఉచిత విద్యుత్ సబ్సిడీకే కేటాయించామని స్పష్టం చేశారు. పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించి, ఆ పథకానికి రూ.1,300 కోట్లు కేటాయించామన్నారు. బీమా పథకం అమలులో లేకపోవడంతో గడిచిన పదేళ్లలో రైతులు ఎంతో నష్టపోయారన్నారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు రూ.17,000 కోట్లు కేటాయించామన్నారు.
నూటికి నూరు శాతం వడ్లను కొనాలి
- కొన్న వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి
- అధికారులకు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచన
మహబూబ్‌నగర్, నవంబర్ 29 (విజయక్రాంతి): ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని నూటికి నూరు శాతం కొనాలని, ఆ వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో కలిసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో వానకాలం ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్న ధాన్యానికి శనివారం లోపు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి చెల్లింపులు చేయాలని అన్నారు.
ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరతో పాటు, బోనస్ కన్నా ఒక రూపాయి తక్కువకి కొనుగోలు చేయకుండా నియంత్రించాల్సిన అవసరం ఉందని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శనివారంలోపు పెండింగ్‌లో ఉన్న రైతులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లింపులు చేయాలని సూచించారు.
సమావేశంలో ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, మేఘారెడ్డి, ఫర్నికారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, వంశీకృష్ణ, వాకిటి శ్రీహరి, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ డీఎస్ చౌహాన్, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.