మంత్రి పొంగులేటి వ్యాఖ్యలతో సర్వత్రా ఆసక్తి
* ఫార్ములా-ఈ నిర్వహణ సంస్థలకు నిధుల విడుదల అంశంలో కేటీఆర్ మౌఖిక ఆదేశాలే ఉన్నాయా.. లేక దానికి సంబంధించిన పత్రాలపై ఆయన సంతకం చేశారా?. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొలిటికల్ బాంబు వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌ను ఇరుకున పెట్టే అంశాలు, ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నట్టు స్పష్టమవుతున్నది.. ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారంలో నిధులు మళ్లింపు జరిగిన ఎఫ్‌ఈవో సంస్థ విచారణలో ప్రధాన అంశం కానున్నది.
- ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో గత పాలకుల పాత్రపై ఆరా
- కేటీఆర్‌కు చుట్టుకుంటున్న నిధుల దారి మళ్లింపు వ్యవహారం!
- ఆయన మౌఖిక ఆదేశాలిచ్చారా.. లేక సంతకం చేశారా?
- బీఆర్‌ఎస్ క్యాడర్‌ను అలర్ట్ చేయడంలో ఆంతర్యమేమిటి?
- రూ.55 కోట్ల నిధులు చేరిన సంస్థపై అనుమానాలు
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి) : దీపావళి పండుగ సందర్భంగా పటాసులు పేల్చుతూ వేడుకలు నిర్వహించుకుంటున్న ప్రజలకు త్వరలో రాష్ట్రంలో పేలబోయే పొలిటికల్ బాంబు అంశం ఆసక్తిగా మారింది.
ఇటీవల దక్షిణ కొరియాలోని సియోల్ నగర పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలంగాణలో పొలిటికల్ బాంబు పేలుతుందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేల్చే పొలిటికల్ బాంబు ఎవరిపైన, ఏ పార్టీ నాయకుల పైన, అసలు ఏ అంశాల్లో ఈ పొలిటికట్ బాంబు పడనున్నదని అందరు ఎదురుచూస్తున్నారు.
పర్యటన పూర్తున వెంటనే రాష్ట్రంలో సంచలనం చోటు చేసుకుంటుందని మంత్రి పొంగులేటి సంచలనం రేపారు. కానీ పర్యటన నుంచి వచ్చిన కొద్దిరోజులు విషయంపై పెద్దగా కదలిక లేదు. అయితే ప్రస్తుతం అనూహ్యంగా రాష్ట్రంలో ఫార్ములా ఈ-రేస్ వ్యవహారం తెరమీదకు వచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేసింగ్ తొమ్మిదవ సీజన్‌కు సంబంధించిన నిధులు దారి మళ్లినట్టు సంచలన ఆరోపణలు బయటకు వచ్చాయి. నగరంలో నిర్వహించిన ఫార్ములా ఈ-రేస్ అంశం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. గతంలో నిర్వహించిన ఫార్ములా ఈ- కారు రేసింగ్ నిధు ల కేటాయింపుపై మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది.
ఈ నిధుల బదలాయింపు వ్యవహారంపై విచారణ జరపాలని కోరింది. దీంతో విచారణకు అనుమతి కోరుతూ ఏసీబీ ప్రభుత్వానికి లేఖ రాసింది. నిబంధన లు పాటించకుండా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఫార్ములా ఈ నిర్వహణ సంస్థ అయిన ఎఫ్‌ఈవోకు రూ.55 కోట్లు చెల్లించింది. ఒప్పందంలో పేర్కొన్న అంశాలు పాటించకపోవడంతో ఫార్ములా ఈ-కారు రేసింగ్ 10వ సీజన్ రద్దు అయింది.
బోర్డు, ఆర్థిక శాఖ నుంచి ముందస్తు అనుమతి లేకుండానే రూ.55 కోట్లు విదేశీ సంస్థకు నిధుల చెల్లింపులు జరిగినట్టు ఆరోపణలున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి 11న హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌లో మొదటి ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీ నిర్వహించారు.
బయట పడిందిలా...
సీజన్-9 ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ కు రూ.200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ. 150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30 కోట్లు ఖర్చు చేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ రూ. 20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవం తం కావడంతో 2024 ఫిబ్రవరి 10న మరోసారి సీజన్-10 నిర్వహించేందుకు ఫార్ము లా-ఈ ఆపరేషన్(ఎఫ్‌ఈవో)తో ఎంఏయూడీ 2023 అక్టోబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నది.
ఇందుకు హెచ్‌ఎండీఏ రూ.55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది. ఈ ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెలిసిటేటర్‌గా ఉండి ఖర్చంతా ప్రైవేట్ సంస్థలైన గ్రీన్‌కో, ఫార్ములా-ఈ నే భరించాల్సి ఉంది. కానీ గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్‌కో సంస్థను తొలగించి దాని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం జరిగిం ది.
ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ అటు ఎన్నికల సంఘం, ఇటు ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఈవెంట్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారు. అయితే 20 23 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
ఒప్పందంలో పేర్కొన్న అం శాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్టు అదే నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం సీజన్-10 రద్దయింది. 2024 ఫిబ్రవరి 10న ఫార్ములా-ఈ రేస్ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది. కానీ అప్పటికే విషయం బయటపడటంతో బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రభు త్వం పూనుకుంది. ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో చట్టవిరుద్ధంగా తీసుకున్న నిర్ణ యం అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు కూడా జారీ చేశారు.
మౌఖిక ఆదేశాలా.. సంతకం చేశారా?
ఫార్ములా-ఈ రేసింగ్ ఈవెంట్‌కు సం బంధించిన వ్యవహారంలో అప్పటి ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ఇప్పటికే మెమో జారీ చేసింది. ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి అప్పు డు కుదిరిన కాంట్రాక్టులోని అంశాలపై పూర్తిగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆ మెమోలో కోరింది.
ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.55 కోట్ల నిధులను హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా-ఈ రేసుకు బదిలీ చేయడంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ మౌఖిక ఆదేశాలతోనే అరవింద్‌కుమార్ ఈ వ్యవహారం నడిపినట్టు సమాచారం.
అయితే ఫార్ములా-ఈ నిర్వహణ సంస్థలకు నిధుల విడుదల అంశంలో కేటీఆర్ మౌఖిక ఆదేశాలే ఉన్నాయా.. లేక దానికి సంబంధించిన పత్రాలపై ఆయన సంతకం చేశారా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పొలిటికల్ బాంబు వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌ను ఇరుకున పెట్టే అంశాలు, ఆధారాలు ప్రభుత్వం వద్ద ఉన్నట్టు స్పష్టమ వుతుంది.
క్యాడర్‌కు కేటీఆర్ హెచ్చరిక
అయితే మంత్రి పొంగులేటి వ్యాఖ్య లు, ప్రభుత్వం చర్యలు పక్కన పెడితే ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్‌ఎ స్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ త్వరలోనే మనపై అనేక కేసులు నమో దు అవుతాయని, అరెస్టులు కూడా జరగవచ్చని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎలాంటి పరిస్థితులైన ఎదురైనా ధైర్యం గా ఎదురుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరిన్ని సందేహాల కు దారి తీస్తున్నాయి. ఫార్ములా రేసింగ్ అంశంలో ఇరుక్కోక తప్పదని తెలిసే కేటీఆర్ ఈ రకంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారనే అనుమానానికి తెరతీస్తుంది. దీంతోపాటు కేటీఆర్ ఉద్దేశం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఉండటంతో తెలంగాణ ప్రజానీకంలోనూ ఈ వ్యవహారమంతా సర్వత్రా చర్చనీయాంశ మవుతుంది.
నిధులెవరికి వెళ్లాయి?
ఫార్ములా-ఈ రేసింగ్ వ్యవహారం లో నిధులు మళ్లింపు జరిగిన ఎఫ్‌ఈవో సంస్థ విచారణలో ప్రధాన అంశం కానున్నది. అసలు ఆ కంపెనీకి అప్పటి ఎంఏయూడీ మంత్రి కేటీఆర్‌కు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్‌కుమార్‌కు ఉన్న సంబంధం ఏమిటి అని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం విచారణ చేయడానికి ఏసీబీకి అనుమతినిచ్చిన క్రమంలో ఏసీబీ కూడా సంబంధిత నిధులు ఎవరికి చేరా యి.
ఏమైనా మనీలాండరింగ్ జరిగిందా?.. ఎఫ్‌ఈవో సంస్థలో కేటీఆర్‌కు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆగమేఘాల మీద ఎఫ్‌ఈవో సంస్థకు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఏముందని విచారించనున్నట్టు సమాచారం.
ఫార్ములా- ఈ రేసింగ్ వ్యవహారంలో ఆరోపణల నేపథ్యంలో కేటీఆర్ ప్రమేయం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేల్చే మొదటి పొలిటికల్ బాంబు ‘కారు’ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పైనే అని అందరూ చర్చించుకుంటున్నారు.