calender_icon.png 9 October, 2024 | 3:56 PM

ఉపాధి పేరిట 'బురిడీ'

09-10-2024 01:06:25 PM

మహిళలకు కుట్టు శిక్షణ పేరుతో రూ 7 లక్షలతో ఉడాయించిన నకిలీ సంస్థ 

నంద్యాల పోలీసులకు మహిళల ఫిర్యాదు 

మంచిర్యాల జిల్లా నెన్నల లో వెలుగు చూసిన ఘటన 

బెల్లంపల్లి, (విజయక్రాంతి): కుట్టు శిక్షణ, ఉపాధి పేరుతో నమ్మించి మహిళలను ఒక నకిలీ స్వచ్ఛంద సంస్థ బురిడీ కొట్టించిన సంఘటన మంచిర్యాల జిల్లా నెన్నల మండలంలో చోటుచేసుకుంది. నంద్యాల ప్రాంతానికి చెందిన మదర్ ప్రతిభ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఎన్జీవో ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్లు అందించి ఎంబ్రాయిడరీ నేర్పిస్తామని నమ్మబలికారు. ఒక్కొక్కరి వద్ద రూ 5 వేల చెప్పులు చాలామంది మహిళల వద్ద డబ్బులను వసూలు చేశారు. మహిళలను మరింతగా నమ్మించేందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చేతుల మీదుగా కృష్ణ పెళ్లి గ్రామానికి చెందిన 8 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

పంపిణీ చేసిన కుట్టు మిషన్ పూర్తిగా నాసిరకంగా ఉండడంతో మహిళలు అనుమానం చెందారు. ఎమ్మెల్యే వినోద్ చేతుల మీదుగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తున్న ఫోటోలను గ్రామాలను చూపిస్తూ మహిళల నుండి డబ్బులను దండుకున్నారు. శిక్షణ మధ్యలోనే మహిళలకు శిక్షణ పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్లు అందించారు. రూ 7 లక్షల వరకు వసూలు చేసి అక్కడి నుండి మదర్ ప్రతిభ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ఉడాయించారు. నకిలీ స్వచ్ఛంద సంస్థ చేతిలో తాము మోసపోయామని గ్రహించిన మహిళలు నంద్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళలను ఉపాధి శిక్షణ పేరిట మోసం చేసిన మదర్ ప్రతిభ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు పోలీసులను కోరుతున్నారు.