- మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు
- తాజాగా లగచర్లలో భూసేకరణ ఉత్తర్వులు ఉపసంహరణ
- ప్రజా ఆందోళనలను గౌరవిస్తూ ప్రభుత్వం నిర్ణయాలు
హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): తమది ప్రజాపాలన అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగానే ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల మనోభావాలను గౌర విస్తూ.. ఈ రెండు మూడు రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంది.
స్థానికంగా జరుగుతున్న ఉద్యమాలు, ప్రజల తిరుగుబాటును అర్థం చేసుకున్న సర్కారు మొన్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయగా.. తాజాగా ఫార్మాసిటీ కోసం లగచర్లలో భూసేకరణ కోసం జారీచేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో ప్రజాభిష్ఠానికి పెద్దపీట వేశామన్న సంకేతాన్ని ఇచ్చింది. లగచర్ల భూసేకరణ, ఇథనాల్ ఫ్యాక్టరీ.. ఈ రెండు అంశాలు ఇటీవల సంచలనంగా మారాయి.
అంతేకాకుండా రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంత రించుకున్నాయి. ఒకవైపు ప్రజలు ఆందోళనలు.. మరోవైపు విపక్షాల ఆరోపణలు.. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన విజయోత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించుకుంటున్న వేళ.. రెండు కీలక అంశాలపై ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
రద్దు వెనుక వ్యూహం ఉందా?
నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో నిర్మించాలని తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ.. వికారాబాద్ జిల్లాలోని దుద్యాల మండలంలోని లగచర్లలో ఫార్మా విలేజ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ అంశం.. ఈ రెండు విషయాలు ఇటీవల రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. కొన్ని రోజులుగా రాజకీయలు ఈ రెండు అంశాల చుట్టే తిరుగుతున్నాయి.
ప్రజల చేస్తున్న ఆందోళనలను ఆసరాగా చేసుకొన్న ప్రతిపక్షాలు.. ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలపై ఎదురు దాడి చేస్తూనే.. ప్రజలను శాంతింపజేసే వ్యూహంలో భాగంగానే ప్రభుత్వం ఈ రెండు ఉత్తర్వులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఇథనాల్ ఫ్యాక్టరీ బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైంది.
గత సర్కారు హయాంలోనే అన్ని అనుమతులు వచ్చాయి. అయితే అనుమతులు ఇచ్చిన సమయంలో ప్రజల్లో రాని తీవ్ర వ్యతిరేకత.. ఇప్పుడు రావడంపైనే అటు కాంగ్రెస్, ఇటు ప్రభుత్వ వర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. దీని వెనుక రాజకీయ శక్తుల ప్రమేయం ఉండొచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
ఎలాగూ ఈ ఫ్యాక్టరీని కాంగ్రెస్ తీసుకురాలేదు. అలాగే, అక్కడి ప్రజలు కూడా వద్దంటున్నారు. ప్రభుత్వం అనుమతులను రద్దు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా, ఈ ఫ్యాక్టరీ ముసుగులో ఉన్న రాజకీయ కుట్రను పటాపంచలు చేసినట్లు అవుతుందన్న అభిప్రాయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీఆర్‌ఎస్ ఇరుకునపడ్డట్టేనా?
లగచర్ల భూసేకరణ అంశం జాతీయ స్థాయిలో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగచర్ల హింస వెనుక బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారన్న వార్తలు వచ్చాయి. బీఆర్‌ఎస్ నేతలు కూడా లగచర్లలో భూసేకరణపై నిత్యం ప్రభుత్వంపై విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇటీవల కమ్యూనిస్టు పార్టీలు కూడా లగచర్లలో పర్యటించి అక్కడి వాస్తవాలను సీఎంకు వివరించారు.
కమ్యూనిస్టు నాయకుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంత రైతులు, ప్రజల్లోని నిజమైన బాధను గుర్తించిన ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం భూసేకరణను ఊపసంహరించుకున్నది. కాలుష్యరహితంగా ఉండే టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసేందుకు అక్కడ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఇండస్ట్రియల్ పార్కు ద్వారా స్థానిక ప్రజలను సంతృప్తి పర్చడంతోపాటు బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టొచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. లగచర్లలో కలెక్టర్‌పై దాడి కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ప్రోద్భలం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
భూసేకరణను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రజలను సంతృప్తిపర్చడంతోపాటు రాజకీయంగా ఈ కేసు విచారణను వేవవంతం చేసి బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టొచ్చన్న వ్యూహంలో ప్రభుత్వం ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.