కుంటలో నీళ్లు తాగుతుండగా చూసిన అటవీసిబ్బంది
బెల్లంపల్లి, జనవరి 31: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీప్రాంతంలో శుక్రవారం పెద్దపులి సంచరి అటవీ అధికారులు గుర్తించారు. శుక్రవారం ఉదయం శ్రీబుగ్గరాజ దేవాలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కన్నాల అటవీప్రాంతంలో గల నీళ్లకుంటలో పెద్దపులి నీళ్లు తాగుతుండగా అటవీసిబ్బంది గమనించారు.
బెల్లంపల్లి అటవీరేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్, బెల్లంపల్లి డిప్యూటీ రేంజ్ అధికారులు ప్రవీణ్‌నాయక్, సతీష్ యానిమల్ ట్రాకింగ్ సిబ్బందితో కలిసి పెద్దపులి సంచరించిన కన్నాల అటవీప్రాంతంలోని నీళ్లకుంట వద్దకు చేరుకున్నారు. కన్నాల ఆలయానికి వెళ్లే మట్టిరోడ్డు గుండా నడుచుకుంటూ నీళ్లకుంట వద్దకు వెళ్లినట్లు పాదముద్రలను గుర్తించారు. బుగ్గ అటవీప్రాంతంలో పలు చోట్ల సీసీ కెమెరాలను అమరాచరు.
పెద్దపులి కుమ్రంభీంఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి అటవీ ప్రాంతం నుంచి కన్నాల అడవుల్లోకి వచ్చినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ పులి బీ అయి ఉంటుందన్నారు. కన్నాల అటవీప్రాంతం నుంచి పెద్దపులి కుంటరాములబస్తీ మీదుగా పెద్దనపల్లి జాతీయ రహదారి దాటి సమీపంలోని అటవీప్రాంతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది.
కన్నాల అడవుల్లోనే మాకాం?
కన్నాల అటవీ ప్రాంతంలో శుక్రవారం కనిపించిన పెద్దపులి గత కొన్ని నెలలుగా ఇదే ప్రాంతంలో మకాం వేసినట్లు తెలుస్తున్నది. బుగ్గ దేవాలయం అటవీప్రాంతానికి అతి సమీపంలోని కాసిపేట మండలంలోని దేవాపూర్ రైల్వేగేట్ సమీపంలో సంచరిస్తూ కార్మికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. కాసిపేట అటవీప్రాంతంలో ఆవుల మందపై దాడి చేసింది. అక్కడి నుంచి బుగ్గగూడెం పరిసర పత్తి చేలలో సంచిరిస్తున్నట్లు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి మండలంలోని కన్నాల అటవీ ప్రాంతంలో గురువారం సాయంత్రం నుండి పెద్దపులి కదలికలున్నట్లు తెలిసింది.శుక్రవారం ఉదయం కన్నాల అటవీప్రాంతంలోని నీళ్లకుంటలో నీళ్లు తాగుతున్న పెద్దపులిని తమ సిబ్బంది ప్రత్యక్ష్యంగా చూశారు. వెంటనే కన్నాల అటవీప్రాంతంలో ఎనిమల్ ట్రాకింగ్ సిబ్బందితో గాలింపులు జరిపాం.కన్నాల అటవీప్రాంతంలోని మట్టిరోడ్డు పై పులి పాతముద్రలు గుర్తించాం.
రోడ్డుకు పక్కనే ఉన్న నీళ్లకుంట ప్రాంతంలో కూడా పలు చోట్ల కనిపించిన పెద్దపులి పాదముద్రలను సేకరించాం.సమీప గ్రామాల ప్రజలు కన్నాల అటవీప్రాంతం మీదుగా రాకపోకలు సాగించవద్దని డప్పు చాటింపు వేయించాం.ప్రధానంగా రైతులు పొలాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్లాలి.బుగ్గ ఆలయానికి భక్తులు ఎవరూ వెళ్లొద్దని సూచిస్తున్నాం.