05-04-2025 01:43:40 AM
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, ఏప్రిల్ 4 : పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తున్నదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చండూరు మున్సిపాలిటీలో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీతోపాటు బంగారుగడ్డలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుక్రవారం ప్రారంభించి ఆయన మాట్లాడారు.
ఎన్నికల హామీలను తూ.చా. తప్పక అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని పేర్కొన్నారు. రైతుల రూ. 2లక్షలలోపు రుణమాఫీ, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండ్ప రూ.500 సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఉప ఎన్నికలు వస్తేనే రేషన్ కార్డులు ఇచ్చిందని, ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇస్తామన్నారు.
త్వరలో కొత్త పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అడ్డగోలుగా మద్యం విక్రయిస్తే ఉపేక్షించేది లేదని, దందా వెనుక ఎంతటి వారున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతకుముందు నాంపల్లిలోనూ పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి రాజగోపాల్రెడ్డి ప్రారంభించారు.
పేదల ఆకలి తీర్చేందుకే సన్నబియ్యం ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్
దేవరకొండ/ పీఏపల్లి, ఏప్రిల్ 4 : పేదల ఆకలి తీర్చాలన్న ధృడ సంకల్ప ంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూ నాయక్ స్పష్టం చేశారు. కొండమల్లేపల్లి, పీఏపల్లి (పెద్దఅడిశర్లపల్లి) మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు గురువారం అధికారులతో కలిసి సన్నబియ్యం పంపిణీ చేసి ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలోని 3 కోట్ల 10 లక్షల మందికి ప్రభుత్వం సన్నబియ్యం అందజేస్తున్నదని తెలిపారు. పేదలు దొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడుతున్నారనే ఆలోచనతో వారి కడుపు నింపేందుకు సన్నబియ్యం పంపిణీ చేస్తు న్నట్లు పేర్కొన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామీగా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసిందన్నారు.
రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. కొండమల్లేపల్లిలో పలు కాలనీల్లో సీసీరోడ్లను సైతం ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ ఎంపీపీ దూదిపాల రేఖ శ్రీధర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ డాక్టర్ వేణూధర్ రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వేమన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.