24-03-2025 01:36:58 AM
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణనికి ఎమ్మెల్యే భూమి పూజ
ఆదిలాబాద్, మార్చి 23 (విజయ క్రాంతి) : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇండ్లు అందజేస్తామని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం సిరికొండ మండలంలోని రిమ్మ గ్రామంలో 153 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ నిత్యం పేదల కోసం పని చేస్తోందని, పేదలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఇళ్ళు లేని నిరుపేద కుటుంబాలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని ప్రకటించారు.
ప్రజా ప్రభుత్వం గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను ప్రతి పేదవాడికి అందిస్తోందని, రూ. 500 కే గ్యాస్ అందిస్తామని వారు పేర్కొన్నారు. పేదోడి సొంతింటి కళలను సాకారం చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.