26-04-2025 05:29:23 PM
గజ్వేల్ డివిజన్ కు 14 రోటవేటర్లు మంజూరి...
50 శాతం సబ్సిడీపై మహిళా రైతులకు పంపిణీ..
గజ్వేల్: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తున్నట్లు డిసిసి అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి, గజ్వేల్ ఏఎంసి చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డిలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గజ్వేల్ డివిజన్ పరిధిలో 14 రోటవేటర్లు మంజూరయ్యాయన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 50 శాతం సబ్సిడీతో యంత్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. ముఖ్యంగా మహిళా రైతులను ప్రోత్సహించే క్రమంలో ప్రత్యేక దృష్టి సారించి ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉత్పాదకతను పెంచడానికి వ్యవసాయ యంత్రాల ప్రాముఖ్యత ఎంతో ఉంటుండగా, ఈ అవకాశాన్నీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అయితే వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ కూలీల కొరత అధిగమించడం, అధిక దిగుబడులు సాధించడం లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా రైతులు పండించిన ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుండగా, రబీ సీజన్ దృష్టిలో పెట్టుకొని అవసరమైన ప్రతిచోట వరి ధాన్యం కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధర కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అక్కారం యాదగిరి, నాయకులు సుఖేందర్ రెడ్డి, జగదేవపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, నక్క రాములు గౌడ్, గుంటుకు శ్రీనివాస్, రేగోండ గౌడ్, జహీర్, ఎక్బల్, రమేష్ గౌడ్, శివారెడ్డి, వూడేo శ్రీనివాస్ రెడ్డి, నేత నాగరాజు, శ్రీగిరిపల్లి కుమార్, డప్పు గణేష్, తదితరులు పాల్గొన్నారు.