- రూ.3,47,299లకు చేరిన రాష్ట్ర తలసరి ఆదాయం
- 2014 10.6 %, 2023 11.4% వృద్ధి
- పదేళ్లుగా జాతీయ సగటు కంటే అధికమే
హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నది. చిన్న రాష్ట్రమే అయినా అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శమ వుతున్నది. తద్వారా తలసరి ఆదాయంలో దేశానికే దిక్సూచిగా నిలుస్తూ వస్తున్నది.
2014 రూ.1,24,104లుగా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం 2023 కు వచ్చేసరికి ఏకంగా రూ.3,47,299లకు పెరిగింది. తెలంగాణతో పోలిస్తే భారతదేశ తలసరి ఆదాయం దరిదాపుల్లో కూడా లేదు. 2014 దేశ తలసరి రూ.86,647లు కాగా ప్రస్తుత 2023 రూ.1,83,236గా నమోదయింది. తలసరి ఆదాయంలోనే కాదు వృద్ధి రేటులోనూ జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ ముందంజలోనే ఉంది. 2014 10.6 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2023 11.4 శాతానికి చేరింది. జాతీయ వృద్ధి 2014 9.5 శాతం కాగా 2023 8.1 శాతం ఉంది.
కరోనాతో కుదేలైనా.. కోలుకున్న తెలంగాణ
2014 నుంచి ప్రతి ఏడాది తలసరి ఆదాయం, వృద్ధి రేటులో మెరుగైన గణాంకాలు నమోదు చేసిన తెలంగాణ రాష్ట్రం.. 2020 సంవత్సరంలో వృద్ధి రేటు ఊహించని స్థాయిలో పడిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభించిపోయిన నేపథ్యంలో తెలంగాణ కూడా తలసరి ఆదాయం, వృద్ధిరేటులో కుదేలయింది. 2020 వృద్ధిరేటు ఏకంగా శాతానికి పడిపోయింది. అయినా తక్కువ సమయంలోనే పుంజుకుని అద్భుతమైన వృద్ధిరేటును కనబర్చింది. ఈ సమయంలో జాతీయ వృద్ధిరేటు కూడా శాతానికి తగ్గింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం గణనీయమైన తలసరి ఆదాయం, నిర్దిష్టమైన వృద్ధిరేటు నమోదు చేసి దేశానికే తలమానికంగా నిలుస్తున్నది.