calender_icon.png 4 February, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినీ వినీలాకాశంలో అందాల తార!

27-01-2025 12:00:00 AM

సినిమా ఓ రంగుల ప్రపంచం.. అలాంటి రంగుల ప్రపంచంలో అందంతో, నటనతో కట్టిపడేసిన నటీమణులెందరో.. అలా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటీమణి పర్వీన్ బాబీ. ఆమె అందచందాలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రపంచం దాసోహమైంది. కొందరు నటులు ఆమెతో ప్రేమాయణం నడిపినా కూడా ఎందుకో ఎవరూ పెళ్లి వరకూ మాత్రం వెళ్లలేదు. ఆమెకు రీల్ లైఫ్ సక్సెస్‌లు చాలా ఉన్నాయి. రియల్ లైఫ్ సక్సెస్‌లే ఒక్కటీ లేవు.

పర్వీన్ బాబీ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ ఏమీ కాదు.. గుజరాత్‌లో అతి సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకుంది. తల్లితో కలిసి ఓ హవేలీలో నివసిస్తూ సైకాలజీ చదివింది. ఆ తరువాత మోడలింగ్.. అక్కడి నుంచి సినీ రంగం వైపు అడుగులు వేసింది. 

టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై..

క్రికెటర్ సలీమ్ దురానీ సరసన చరిత్ర మూవీలో నటించింది. ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రమైతే ‘మజ్బూర్’. ఈ చిత్రంలో వేశ్యగా నటించింది. ఆ తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోని, కాలాపత్తర్, సుహాగ్, షాన్ , నమక్ హలాల్’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించి మంచి సక్సెస్‌లు అందుకుంది. అమితాబ్ బచ్చన్‌తో ఆరు సినిమాలు చేసింది.

అవన్నీ మంచి విజయాలు అందుకున్నాయి. ఆ రోజుల్లో పర్వీన్ మోడ్రన్, గ్లామర్ పాత్రలతో ఆకట్టుకుంది. అందుకేనేమో అమెరికా టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజీపై పర్వీన్ బాబీ ఫోటోని ముద్రించింది. టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కనిపించిన తొలి బాలీవుడ్ నటిగా పర్వీన్ బాబీ చరిత్ర సృష్టించింది.  

లవ్ స్టోరీకి ఫుల్‌స్టాప్..

పెళ్లున వ్యక్తితో ప్రేమాయణం సాగించి పర్వీన్ బాబీ అప్పట్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆ వ్యక్తి మరెవరో కాదు నటుడు కబీర్ బేడి. ఇటాలియన్ సీరియల్ సెట్ వీరి ప్రేమకు పునాది వేసింది. అయితే కబీర్‌కు యూరప్‌లో గ్రాఫ్ పెరిగింది.. ఇటు పర్వీన్‌కు సంతకం చేసిన సినిమాల కోసం ముంబైలో ఉండాల్సిన పరిస్థితి..

వెరసి ఈ లవ్ స్టోరీకి ఫుల్‌స్టాప్ పెట్టి.. మరో లవ్ స్టోరీకి డోర్ ఓపెన్ చేసింది పర్వీన్. ఈ బాధ నుంచి కోలుకోక ముందే మహేశ్ భట్‌తో స్నేహం కాస్తా ప్రేమగా మారింది. అప్పటికే ఆయనకు వివాహమైంది. అయినా సరే పర్వీన్ కోసం కుటుంబాన్నే వదిలేసి ఆమెతో సహజీవనం మొదలు పెట్టాడు. 

ఆస్తి మొత్తం అనాథ శరణాలయాలకు..

ఏమైందో ఏమో సడెన్‌గా పర్వీన్ మానసిక స్థితిలో మార్పొచ్చింది. ఒకరోజు మహేశ్ ఇంటికి వెళ్లేసరికి అమితాబ్ తనను కిడ్నాప్ చేయించాడని ఒకరోజు.. శంఖంలో బాంబ్ ఉందంటూ మరొక రోజు.. తనకు పెట్టే అన్నంలో విషం కలుపుతున్నారంటూ రోజుకో రచ్చ చేసేది. సైక్రియాట్రిస్ట్‌కు చూపిస్తే పారనాయిడ్ స్కిజోఫ్రీనియా అని తేలింది. మానసిక సమస్యలతో పాటు శారీరక సమస్యలు ఆమెను ఇబ్బందిపెట్టాయి.

2005 జనవరి 20న తన నివాసంలో తుదిశ్వాస విడిచింది. విచిత్రమేంటంటే.. ఆమె మరణించిన దాదాపు మూడు రోజుల వరకూ పక్కింటి వారికి కూడా తెలియలేదు. పర్వీన్ అంత్యక్రియలను మహేశ్ భట్ దగ్గరుండి జరిపించారు. తన ఆస్తి మొత్తాన్ని అనాథ శరణాలయాలకు రాసిచ్చేసింది.