16-02-2025 12:00:00 AM
సముద్రతీరాన్ని తాకే అలల్నీ, పచ్చని ప్రదేశాల్నీ ఎంత సేపు చూసినా తనివి తీరదు. ఒకేసారి ఆ రెండింటినీ చూస్తుంటే ఎంత బాగుంటుందో కదూ. ముంబయి మహానగరంలోని బృహన్ ముంబయి కార్పొరేషన్ మాత్రం అందుకు అవకాశం కల్పించింది. సముద్రతీరాన్ని ఆనుకుని ఉన్న ఓ అడవిపైన నడుస్తూ అలల అందాల్ని ఆస్వాదించే ఏర్పాట్లు చేసింది.
అందుకోసం దాదాపు కిలోమీటరు పొడవున నిర్మించిన స్కైవాక్ వంతెనపైన నడుస్తుంటే- ఓవైపు సముద్రగాలులు కితకితలు పెడుతుంటాయి. మరోవైపు పక్షుల కిలకిలరావాలు శ్రావ్యంగా చెవులను తాకుతుంటాయి.
చెక్కతో నిర్మించిన ఈ స్కైవాక్ రహదారి మధ్యలో అక్కడక్కడా పారదర్శకంగా కనిపించే అద్దాలు ఆ పరిసరాల్ని మరింత అందంగా చూపిస్తాయి. కాంక్రిట్ నిర్మాణాలకు దూరంగా.. ఆహ్లాదాన్ని పంచే ఇలాంటి ప్రదేశాల్లో కాసేపు గడిపినా మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదా!
ఎలా వెళ్లాలి
హైదరాబాద్ నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ముంబయి మహా నగరం ఉంటుంది. రైలు, బస్సు, విమాన సౌకర్యం కలదు. అక్కడికి చేరుకోవడానికి దాదాపు 13 గంటల సమయం పడుతుంది.