మెల్‌బోర్న్: నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే కారణమని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ‘మెల్‌బోర్న్ టెస్టులో విజయం గురించి ఆలోచించలేదు. బ్యాటింగ్ వైఫల్యం మా కొంపముంచింది. జైస్వాల్ అద్భుతంగా పోరాడాడు. పంత్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడం మా ఓటమికి కారణమైంది. అయితే పంత్‌ను తప్పుబట్టడానికి లేదు.
క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సార్లు జట్టును గెలిపించాడు. జైస్వాల్ ఔట్ విషయంలో క్లారిటీ లేదు. కొత్త టెక్నాలజీ వంద శాతం ఫలితాలు ఇవ్వలేకపోతుంది. బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడాల్సి ఉంది. ఆఖరి సెషన్‌లో ఆసీస్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి ఫలితం సాధించారు.
బుమ్రా విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. బుమ్రాకు తోడుగా సిరాజ్, ఆకాశ్ దీప్ మంచి లైనప్‌తో బౌలింగ్ వేసినప్పటికీ వికెట్లు దక్కలేదు. గిల్ ఆడిస్తే బాగుంటుందని కొందరన్నారు. కానీ జట్టు సమతూకం కోసం ఒక్కోసారి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది. గిల్ స్థానంలో సుందర్‌ను ఆడించడం వల్ల ఏం జరిగిందో మీకు తెలుసు. సిరీస్ ఇంకా ముగియలేదు. సిడ్నీ టెస్టులో గెలిచి సిరీస్‌ను 2 సమం చేస్తాం’ అని రోహిత్ పేర్కొన్నాడు.