09-04-2025 12:09:19 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : ముషీరాబాద్ డివిజన్ బాపూజీ నగర్లో స్థానిక ప్రజల సౌకర్యార్థం బస్తీ దవాఖాన ఏర్పాటుకు కృషి చేయాలని కోరుతూ స్థానిక మహిళలు కాంగ్రెస్ నగర కార్యదర్శి తమగొండ రాజ్ దీప్‌కు వినతి పత్రం అందజేశారు. మంగళవారం బాపూజీ నగర్ లో స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు రాజ్ దీప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
అనంతరం రాజ్‌దీప్ మాట్లాడుతూ బాపూజీనగర్ లోని కమ్యూనిటి హాల్లో దవాఖానను ఏర్పా టు చేసేందుకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. త్వరితగతిన దవాఖాన ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి సైతం తీసుకెళ్లి ప్రజలకు దవాఖాన అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్ యాదవ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు జిఎన్ చారి, పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ రామ్ తదితరులు పాల్గొన్నారు.