- గందరగోళంగా మారిన గ్రామసభలు
- జాబితాలో మా పేర్లు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్న ప్రజలు
సంగారెడ్డి, జనవరి 23 ( విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామసభల్లో ప్రజలు అధికారులకు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. గురువారం సంగారెడ్డి జిల్లాలో జరిగిన గ్రామసభల్లో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రకటించి ఇంతవరకు అందించలేదని నిలదీశారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు రావడంతోనే గ్రామసభలు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు మరోసారి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని మూడో వార్డులో నిర్వహించిన గ్రామసభలో ప్రజలు అధికారులను నిలదీశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో అరులైన నిరుపేదల పేర్లు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తల పేర్లు రావడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గ్రామ సభకు హాజరైన మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, అధికారులు గ్రామసభ నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు. సంగారెడ్డి జిల్లాలో ఎక్కడ చూసినా గ్రామసభల్లో గంద్రగోళ పరిస్థితి నెలకొంది. ఝరా సంఘం మండలంలోని జీర్లపల్లి గ్రామంలో ప్రజలు గ్రామ సభలను అధికారులను బహిరంగంగా నిలదీశారు.
పంచాయతీ ఎన్నికలు రావడంతోని గ్రామసభలు పెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసి గ్రామసభలు పెట్టాలని వారు నిలదీశారు. ఝరాసంగం గ్రామంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే మాణిక్యరావు పాల్గొనగా అక్కడ ప్రజలు అధికారు లను నిలదీశారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభల పేరుతో నాటకమాడుతుందని ఆరోపించారు. గ్రామసభల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డుల పైనే ఆందోళన కనిపించింది.
అనరులైన వారికి సంక్షేమ పథకాలు అందించేందుకు జాబితాలు పేర్లు చేర్చారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అనరులైన వారి పేర్లను జాబితాలో ఉంచారని ప్రజలు అగ్రహారం వ్యక్తం చేస్తున్నారు.
ఆత్మీయ భరోసాలో పేర్లు లేవు
ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తున్న మా పేర్లు ఆత్మీయ భరోసా పథకం జాబితాలో లేవని పలువురు కూలీలు అధికారులను ప్రశ్నించారు. మాకు ఒక గుంట భూమి లేదు ఉపాధి హామీ పని చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నామని ఎందుకు ఆత్మీయ భరోసా లో మా పేరు లేదని అధికారులను నిలదీస్తున్నారు.
ఇంద్రమ్మ ఇల్లు కోసం ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న జాబితాలో మా పేరు లేదని ప్రజలు అధికారులను నిలదీశారు. ఇంటి స్థలం లేదు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం లేదని చాలామంది ప్రజలు అధికారులను నిలదీశారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ఫలితం లేకుండా పోతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేషన్ కార్డులు కొత్త వారి పేర్లు నమోదు చేయడం లేదని అధికారులను నిలదీశారు. కొత్తగా పెళ్లయింది భార్య పేరు నమోదు చేయలేదు. పిల్లలు పుట్టిన వారి పేరు కూడా నమోదు చేయడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డులు కొత్త పేర్లు నమోదు చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.