calender_icon.png 24 October, 2024 | 4:03 AM

జహీరాబాద్‌లో ఉద్రిక్తతకు దారితీసిన బంద్ పిలుపు

24-10-2024 01:54:23 AM

రెండు వర్గాల మధ్య ఘర్షణ

సంగారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి)/ జహీరాబాద్: హిందూ దేవాల యాలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఓ వర్గం వారు బుధవారం జహీర్‌బాద్ బంద్‌కు ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ వర్గం వారు బంద్ చేసేందుకు ర్యాలీ నిర్వహిస్తుండగా, మరో వర్గానికి చెందిన వ్యాపారి హోటల్ మూసేయకపోవడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే కొందరు రాళ్లతో హోటల్‌పై దాడి చేయడంతో హోటల్ అద్దాలు పగిలిపోయాయి. ఇరువర్గాల మధ్య మాటా మాట పెరిగి పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు.

కాగా, నెల రోజుల క్రితమే ఓ వర్గానికి చెందిన యువకులు మరో వర్గానికి చెందిన జెండాను తొలగించడంతో అప్పుడు సైతం పరిస్థితి ఉధృతంగా మారింది. జహీరాబాద్‌లో గత కొన్ని రోజులుగా ఒక వర్గంపై మరో వర్గం దాడులు చేసుకోవడం, విమర్శలు చేసుకోవడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. 

నారాయణఖేడ్ బంద్ ప్రశాంతం

నారాయణఖేడ్: దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ వీహెచ్‌పీ, ఇతర  హిందూ సంఘాల ఆధ్వర్యంలో నారాయణఖేడ్‌లో బుధవారం చేపట్టిన బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్‌లో భాగంగా ఉదయం నుంచే ఆయా సంఘాల నాయకులు పట్టణంలో పర్యటిస్తూ బంద్‌కు సహకరించాలని వ్యాపారస్తులను కోరారు.

స్థానిక మంగల్‌పేట్‌లోని దుర్గమ్మ ఆలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రత్యేక పోలీసు బందోబస్తును నిర్వహించారు. బంద్‌లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.