calender_icon.png 8 February, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్‌బోర్డులకు కళ్లెం!

29-01-2025 12:00:00 AM

దేశంలో లక్షల కోట్ల విలువైన ఆస్తులను కలిగి ఉన్న వక్ఫ్‌బోర్డులపై ప్రభుత్వ నియంత్రణకు రంగం సిద్ధమైంది. ఇప్పటివరకు ఈ వక్ఫ్‌బోర్డులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నియంత్రణ లేదు. దీంతో కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయనే విమర్శలు చాలాకాలం గా వినిపిస్తూనే ఉన్నాయి. అంతేకాదు వక్ఫ్‌బోర్డులు కొందరు పలుకుబడి కలిగిన వ్యక్తుల చేతిలో ఉన్నాయన్న వాదనలు కూడా ఉన్నాయి.

ముస్లింనేతలు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అందుకే కనిపించిన ప్రతి భూమీ, ఆస్తి తమదేనంటూ నియంత్రణలోకి తీసుకొంటున్న వక్ఫ్‌బోర్డుల అపరిమిత అధికారాన్ని కట్టడి చేయడానికి కేంద్రం వక్ఫ్ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును ప్రభుత్వం గత ఏడాది పార్లమెంటులో ప్రవేశపెట్టింది.

వక్ఫ్‌బోర్డులో మహిళలు, ఓబీసీ ముస్లింలు, షియా, బోహ్రా, తదితర ముస్లింలకు చోటు కల్పిస్తూ 1954నాటి వక్ఫ్ చట్టానికి మరోసారి సవరణలు తీసుకువస్తూ ప్రభుత్వం బిల్ల్లును తీసుకువచ్చింది. ప్రతిపక్షాల అభ్యంతరాలతో బిల్లును జేపీసీకి నివేదించారు. దీనిపై అనేకసార్లు సమావేశం కావడంతో పాటు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న జేపీసీ ముసాయిదా బిల్లుకు 14 సవరణలతో ఆమోదం తెలిపింది.

జేపీసీలోని ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన  సవరణలకు ఆమోదం తెలిపిన కమిటీ ప్రతిపక్షాలు సూచించిన అన్ని మార్పులను తిరస్కరించడం విశేషం. ఈ నెల 31న తుది నివేదికను లోక్‌సభకు అందజేయనున్నట్లు జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్  మీడియాకు తెలియజేశారు.ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రా ల్లో 30 వరకు వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. రైల్వే, రక్షణ శాఖ తర్వాత దేశంలో ఎక్కువ భూములు వక్ఫ్‌బోర్డులకు ఉన్నాయని ప్రభుత్వం చెప్తోంది.

1.2 లక్షల కోట్ల విలువైన భూములు, ఆస్తులు వక్ఫ్‌బోర్డుల అధీనంలో ఉన్నాయి. దాదాపు 58 వేలకు పైగా వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని, 4.35 లక్షల ఆస్తుల గురించి సమాచారమే లేదని గతంలో సచార్ కమిటీ నివేదిక పేర్కొంది. వక్ఫ్ ఆస్తులను సక్రమంగా వినియోగించుకుంటే రూ. 2వేల కోట్ల ఆదాయం వస్తుందని, అయితే ఇప్పుడు రూ.200 కోట్ల ఆదాయం మాత్రమే వస్తోందని ప్రభుత్వం అంటోంది.

దేశంలో ఏ ఇతర మతాలకు చెందిన మఠాలు, అఖారా, ట్రస్టులు, సొసైటీలకు లేని అపరిమిత ఆధికారాలను, స్వతంత్ర హోదాను వక్ఫ్ బోర్డులకు కట్టబెట్టారని కేంద్రం ప్రతిపాదిత బిల్లులో పేర్కొంది. అందుకే ఈ అధికారాలను కట్టడి చేయడంతో పాటు వక్ఫ్‌బోర్డుల నిర్వహణలో మరింత పారదర్శకతను తీసుకు రావడానికి ఈ బిల్లును తీసుకువస్తున్నట్లు కేంద్రం చెప్తోంది.

వక్ఫ్‌బోర్డులను సంస్కరించాల్సిన అవసరం ఉందని ముస్లింనేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే ఆ పేరుతో మత స్వేచ్ఛకు భంగం కలిగించాలని చూస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.  ఇది క్రూరమైన బిల్లు అని, రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్, టీఎంసీ, మజ్లిస్, ఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి.  అయితే ఈ నెల 24న జరిగిన ప్యానెల్  చివరి సమావేశం రసాభాసగా ముగిసింది.

జేపీసీ చైర్మన్ ఇష్టారీతిన అజెండాను మారుస్తున్నారంటూ కమిటీలోని విపక్ష సభ్యులు గొడవ చేయడంతో కమిటీలోని 10 మంది విపక్ష సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే చైర్మన్ వ్యవహరిస్తునారంటూ విపక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు.

మొదటినుంచీ జగదంబికా పాల్ తీరుపై జేపీసీలోని విపక్ష సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కాగా ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిసెషన్‌లోనే ఈ బిల్లుకు ఆమోదం పొందాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. పార్లమెంటు ఉభయ సభల్లో అధికార ఎన్డీఏకు మెజారిటీ ఉన్న నేపథ్యంలో అదేమీ పెద్ద కష్టం కాకపోవచ్చు.