తిమ్మాపూర్, సిరిసిల్ల ప్రాంతాల్లో జోరుగా తోటల పెంపకం
మానకొండూర్/ సిరిసిల్ల, అక్టోబర్ 30: పండగేదైనా.. శుభకార్యమేదైనా.. అలంకరణకు మొదట గురొచ్చే పూల పేరు బంతి ! తెలుగింటి లోగిళ్లకు అందమైన తోరణాలు బంతి పూలే. ఇంటికి వచ్చే అతిథులైనా, స్నేహితులైనా బంతి పూల తోరణాలు, వాటి పరిమళాలు కని ఫిదా అవ్వాల్సిందే ! 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారు మెక్సికో నుంచి బంతి పూవు భారత్‌కు వచ్చింది.
అప్పటినుంచి మన సంస్కృతీ సంప్రదాయాల్లో బంతి పూవు భాగమైంది. బంతి పూల తోటలు కొందరు రైతులు ఉపాధి సైతం పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని తిమ్మాపూర్ మండలం బంతి తోటల పెంపకానికి ప్రసిద్ధి. మండలంలో ఏ మూలకు వెళ్లినా మనకు బంతి తోటలు దర్శనమిస్తాయి. పుడమి పసుపు రంగు చీరెకట్టినట్లు ఆహ్లాదపరుస్తాయి.
మండలానికి చెందిన కొంద రు రైతులు 15 ఏళ్ల నుంచి బంతి పూల సాగుపైనా ఆధారపడి జీవిస్తున్నారు.అలాగే సిరిసిల్ల జిల్లా వేములవాడ -సుద్దాల గ్రామానికి వెళ్లే మార్గంలోనూ కొందరు రైతులు బంతిపూల తోటలు పెంచుతున్నారు. ఏప్రిల్‌లో తోటలు ప్రారంభిస్తే ఆగస్టు, సెప్టెంబర్ కల్లా పూలు చేతికొస్తాయి.
దేవతల గురువు బృహస్పతిని బంతి పూలతో పూజిస్తే జ్ఞానం మనలో పెంపొందుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి పండుగ కు ప్రతి ఇంట్లోనూ బంతి పూల తోరణాలు కట్టడానికి ఇష్టపడతారు. వేదిక ఏదైనా బంతిపూలు అలకరించేందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. గురువారం దీపావళి సందర్భంగా ఎంతోమంది బంతిపూల తోటలకెళ్లి పూలు కొంటూ కనిపించారు.
పండగ వచ్చిందంటే మస్తు గిరాకీ..
ఏ పండగ వచ్చినా బంతి పూలకు మంచి గిరాకీ. నేను బంతి తోటలు పెం చుతున్నాను. మా తోట వద్దకు కరీంనగర్‌తో పా టు హైదరాబాద్ నుంచి కూడా కొందరు వచ్చి పూలు కొంటారు. కొన్నిసా ర్లు డిమాండ్‌కు సరిపడా పూలు సప్లు చేయలేం. మా కుటుంబం పూల తోటలపైనే ఆధారపడి జీవిస్తున్నాం.
శ్రీనివాస్, రైతు, తిమ్మాపూర్