15-04-2025 10:09:48 PM
సిపిఆర్ చేసి బతికించిన 108 సిబ్బంది...
తల్లి, బిడ్డ క్షేమం..
కొండపాక: నెలలు నిండని గర్భిణీకి 108 అంబులెన్స్ సిబ్బంది సుఖ ప్రసవం చేసి తల్లి బిడ్డలను ప్రాణాపాయస్థితి నుంచి కాపాడిన సంఘటన కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులో ఓ ఫామ్ హౌస్ లో ఉంటున్న త్రివేణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆమె భర్త సురేందర్ 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది చేరుకొని పరిస్థితిని గమనించారు. పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో అంబులెన్స్ లో తీసుకువచ్చే పరిస్థితులు లేకపోవడంతో అక్కడే సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మగ బిడ్డ పుట్టాడు.
నెలలు నిండకుండా ఉండడంతో పుట్టిన బిడ్డ తక్కువ బరువు ఉండి, ఎటువంటి చలనం లేకపోవడంతో పరిస్థితిని 108 ప్రధాన కార్యాలయం వైద్యుడు పార్థసారధికి సమాచారం తెలుపగా ఆయన సలహా సూచనలతో పుట్టిన బిడ్డకు సిపిఆర్ చేసి కదలికలు తెప్పించారు. వెంటనే తల్లి బిడ్డలను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తల్లికి ఎలాంటి ప్రమాదం లేదని, తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని అబ్జర్వేషన్లో ఉంచుతున్నట్టు డాక్టర్లు పేర్కొన్నారని వారు తెలిపారు. సమయానికి తల్లి బిడ్డలకు ప్రాథమిక చికిత్స అందించిన సిబ్బందిని వారి బంధువులు అభినందించారు.