01-04-2025 07:44:47 PM
ప్రజాపాలన అంటే విద్యాలయాలను, ప్రకృతిని విధ్వంసం చేయడమేనా..
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్..
మంచిర్యాల (విజయక్రాంతి): హెచ్.సి.యూ భూముల అమ్మకాన్ని వెంటనే ఆపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీ యు) విద్యార్థుల మీద, ఎస్ఎఫ్ఐ విద్యార్థి యూనియన్ నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని సిపిఎం జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
హెచ్.సీ.యు భూముల రక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు వెళ్లకుండా ముందస్తుగా సిపిఎం పార్టీ నాయకత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాల మీద, నాయకుల మీద నిర్బంధం పెరిగిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాయ మాటలు చెప్పి అధికారం చేపట్టాక గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అనుసరిస్తుందని విమర్శించారు.
400 ఎకరాల సెంట్రల్ యూనివర్సిటీ భూమిని అమ్మకానికి పెట్టే ప్రయత్నాలను ప్రభుత్వము ఇప్పటికైనా విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయవలసిన దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. 400 ఎకరాల భూమి అమ్మకం ప్రయత్నాలను విరమించాలని, విద్యార్థుల మీద కేసులు ఉపసంహరించకోవాలని, తక్షణం అరెస్టు చేసిన విద్యార్థులను, రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.