మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం, గడిపల్లి గ్రామంలో గురువారం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయమంత్రి నిముబెన్ జయంతిబాయ్ బంబానియా పర్యటించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్ వాడి కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రూపిరెడ్డిపల్లి రైతు సహకార సంఘాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విద్యా, ఆరోగ్య, రైతుల ఆర్థికాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టిని సారించాలని సూచించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంత్రి 8వ తరగతి విద్యార్థులచే జీవశాస్త్రం పాఠాన్ని చదివిపించి, మంచిగా చదివారని అభినందించారు. పాఠశాలకు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. విద్యార్థులతో అనుబంధం పెంచుతూ వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. అంగన్ వాడి కేంద్రంలో మంత్రి గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు.