ఆందోల్,(విజయక్రాంతి): రైతులు పండించిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం దళారుల పాలు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం మాసాన్ పల్లిలో పెద్దమ్మ దేవాలయ ధ్వజ స్థంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... వరి కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులకు పెట్టుబడి సహాయం ఇవ్వక, ఒడ్లు కొనుగోలు చేయాక, సకాలంలో మద్దతు ధర అందించకపోవడంతో తక్కువ ధరకు ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకొని తీవ్రంగా నష్టపోతున్నారనిఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సారి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తే 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని ఆ సివిల్ సప్లై కమిషనర్ చౌహన్ ప్రకటించగా ఇందులోని 20 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ధాన్యం ఎవరి పాలైందని ప్రశ్నించారు.
పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై తాను ప్రశ్నిస్తే తనపై భూ కబ్జాదారుడంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్లాక్ మెల్ రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. రంగనాయకసాగర్ వద్ద రైతుల నుండి 13 ఎకరాల పట్టాదారు భూమిని ధరణి ద్వారా కొనుగోలు చేసానని అందులో సెంటు భూమికూడా ప్రభుత్వకాదని తాను అక్రమించలేదని చెప్పారు. ఆ భూమి విషయంలో మీ సమక్షంలో నా భూమినీ కోలుద్దాం నేను రెడీ అని సవాల్ విసిరారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన తొమ్మిది హామీలతో ఒక్క హామీ కూడా అమలైందా అని ప్రశ్నించారు. రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని మంత్రి హరీష్ హెచ్చరించారు.