జడ్చర్ల,(విజయక్రాంతి): బాధితులకు సత్వరమే న్యాయం అందటంతో పాటు నేరస్తులకు కఠిన శిక్షలు పడేందుకు చట్టాల్లో మార్పులు తీసుకరావాల్సినవసరం ఉందని రాష్ట్ర పోలీస్ విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ డిజిపి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కు చెందిన దాదాపు 270 మంది కానిస్టేబుల్స్ గా ఎంపికైన అభ్యర్థుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో క్యాడేట్ లు నిర్వహించిన గౌరవ వందనాన్ని జోనల్ డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తో కలసి ఆయన స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ అన్ని ఉద్యోగాలలో పోలీస్ ఉద్యోగం చాలా గొప్పదని ప్రజలకు ప్రతేక్షంగా సేవలు అందించే వారు పోలీసులని అన్నారు. తొమ్మిది నెలల పాటు శిక్షణ తీసుకున్న అభ్యర్థులు పాత చట్టాల తో పాటు కొత్త చట్టాలను సైతం నేర్చు కున్నారని విధుల్లో చేరిన తరువాత సంఘ విద్రోహుల పట్ల కర్కశంగా ఉంటూనే సామాన్య ప్రజల హక్కులను కాపాడాలని సూచించారు. ప్రజలకు కష్టాల సమయంలో గుర్తొచ్చేది పోలీసులేఅని ఇంకా సమాజంలో పోలీసుల పై గౌరవం ప్రేమ ఉందన్నారు. దేశ రక్షణ కోసం తమ పిల్లలని పోలీసులుగా తయారు చేసిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
20 ఏళ్ల క్రితం ఇక్కడ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు తాను ఎస్పీ గా ఉన్నప్పుడు పడిన శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. చాలా క్రమశిక్షణతో ఈ తొమ్మిది నెలలు శిక్షణ తీసుకున్నారని విధుల్లో భాగంగా కేటాయించిన పట్టణాల్లో, గ్రామాల్లో సమర్డవంతంగా విధులు నిర్వహించి సమాజంలో డిపార్ట్ మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి, అడిషనల్ ఎస్పీ రాములు, డిఎస్పీలు, సీఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.