calender_icon.png 23 October, 2024 | 12:58 AM

బోయిన్‌పల్లి రోడ్లు బాగు చేయండి

23-10-2024 12:00:00 AM

హైదరాబాద్ పరిధిలోని పాత బోయిన్‌పల్లి సుమారు యాభైకి పైగా కాలనీలతో, దాదాపు లక్ష జనాభా కలిగి ఉంది. దేశంలోనే పెద్ద కూరగాయల మార్కెట్, ఇంకా అనేక వ్యాపార కూడళ్లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన రహదారులూ చాలా ఇరుకుగా ఉండడం పెద్ద సమస్య. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా రహదారులు లేవు.

దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంటుంది. ఎప్పు డో కొత్తగా కాలనీలు వెలసినప్పుడు ఏర్పడిన రోడ్లు ఇప్పటికి కూడా అవే కొనసాగుతున్నాయి. ఇతర ప్రాంతాలలో రోడ్లు వెడల్పు, ఫ్లయి ఓవర్ అండర్ పాసులతో సుందరవంతమైన చౌరస్తాలు నిర్మితమవుతుంటే బోయినపల్లి ప్రాంతాన్ని మాత్రం ప్రభుత్వం విస్మరించడం బాధాకరం.

దుబాయ్ గేటు, హస్మత్‌పేట్, మల్లికార్జున్ నగర్ నుండి నేషనల్ హైవే 44 వరకు, అశోక గార్డెన్, బాపూ జీనగర్, పెట్రోల్ పంపు చౌరస్తా, సరోజినీ పుల్లారెడ్డి ఇంటిద్వారా న్యూబోయినపల్లి వరకు, అలాగే రాజీవ్ రహదారి-నేషనల్ హైవే 44 అనుసంధానమైన డైరీ ఫారం ఉన్న ప్రభుత్వం వెంటనే బాగు పరచాలి. జూబ్లీ బస్‌స్టేషన్, సికింద్రాబాద్ ప్రాంతాలకు ఈ మార్గాల గుండానే నిత్యం రాకపోకలు సాగుతాయి. బోయిన్‌పల్లి పరిసరాలలో మెరుగైన రోడ్డు సౌకర్యాలు కల్పించాలి.

 దండంరాజు రాంచందర్‌రావు, పాత బోయిన్‌పల్లి