calender_icon.png 15 January, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా సహనాన్ని పరీక్షించొద్దు

13-09-2024 01:13:13 AM

  1. కౌశిక్‌రెడ్డి బతుకేందో అందరికీ తెలుసు
  2. పద్ధతి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు
  3. ఎమ్మెల్యేలు దానం, ప్రకాశ్, కాలె, ఎంపీ అనిల్
  4. నార్సింగి పీఎస్‌లో ఎమ్మెల్యే గాంధీకి పరామర్శ

రాజేంద్రనగర్, సెప్టెంబర్12: ‘మా సహనాన్ని పరీక్షించొద్దు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సహనం పాటిస్తున్నాం. అనవసరంగా తమను గెలికితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్  అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ వ్యవహారంలో పోలీసులు గాంధీని అరెస్టు చేసి నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.

మధ్యాహ్నం నాలుగు గంటలకు పీఎస్‌లో గాంధీని ఎమ్మెల్యేలు, ఎంపీ పరామర్శించారు. అనంతరం పీఎస్ ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే గాంధీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిచ్చికుక్కలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 

అధికారం మాదే.. ఏదైనా చేస్తం..

బీఆర్‌ఎస్ నేతలు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఎమ్మెల్యేలు దానం, ప్రకాశ్‌గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ ఆరోపించారు. గత సర్కారు హయాంలో అడ్డగోలుగా వ్యవహరించారని విమర్శించారు. తాము కోర్టు ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తున్నామని, కౌశిక్‌రెడ్డి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ తమను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. తాము అధికారంలో ఉన్నామని, తాము అనుకుంటే ఏదైనా చేస్తామన్నారు. ఎమ్మెల్యే గాంధీ టెక్నికల్‌గా ఇంకా బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్లు గుర్తు చేశారు. కౌశిక్‌రెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని సూచించారు. హరీశ్‌రావు సీజనల్ పొలిటీషియన్ అని దానం ఎద్దేవా చేశారు. 

 బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లను దిగ్బంధిస్తం..

 తాము అధికారంలో ఉన్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా దిగ్భందిస్తామని హెచ్చరించారు. కౌశిక్‌రెడ్డి ప్రాంతాల మధ్య విబేధాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కౌశిక్‌రెడ్డి సంగతి అందరికీ తెలుసని అన్నారు. తాము మహిళా కాంగ్రెస్ నేతలను పంపించి కౌశిక్‌కు చీర కట్టించి గాజులు తొడిగిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్ నేతలు తమ తీరు మార్చుకోకపోతే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేతలు పీఎస్‌కు తరలిరావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి, రాజేంద్రనగర్ ఏసీపీలు రమణగౌడ్, శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షించారు.