calender_icon.png 17 September, 2024 | 1:48 AM

జులానా నుంచి వినేశ్ పోటీ

07-09-2024 02:09:29 AM

  1. కాంగ్రెస్‌లో చేరిన రెజ్లర్ 
  2. బీజేపీ మినహా అన్ని పార్టీలు నాకు మద్దతుగా నిలిచాయి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: భారత స్టార్ రెజ్ల ర్ వినేశ్ ఫోగట్‌కు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్‌లో శుక్రవారం చేరిన వినేశ్‌కు జులనా బరిలో నిలిచే అవకాశాన్ని కాంగ్రెస్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో అధిక బరువు కారణంగా వేటు వేయడంపై స్పందించారు. వినేశ్‌తో పాటు భజరంగ్ పూనియా కాంగ్రెస్‌లో చేరిన అనంతరం మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తన అనర్హత వేటుపై ఏదైనా రాజకీయ కుట్రకోణం ఉందా అనే ప్రశ్నకు వినేశ్ సమాధానమిచ్చారు. అది నాకు ఎంతో ఉద్వేగపూరితమైన అంశం. కొన్ని రోజుల తర్వాత ఈ విషయంలో సవివరంగా మాట్లాడుతా. అప్పటివరకు ఎదురుచూడండి అని వినేశ్ ఫోగట్ పేర్కొన్నారు. ఇక నిరసనల సమయంలో బీజేపీ మినహా అన్ని పార్టీలు తమకు మద్దతుగా నిలిచాయని ఫోగట్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తమ కన్నీళ్లను అర్థం చేసుకుందని, తమ పోరాటం ఇంకా ముగియలేదని చెప్పారు.

ప్రస్తుతం ఈ అంశం కోర్టు అధీనంలో ఉందని, కచ్చితంగా న్యాయమే గెలుస్తుందన్నారు. దేశంలోని మహిళల కోసం తమ గళం  వినిపించినందుకు మూల్యం చెల్లించుకున్నామని భజరంగ్ పూనియా ఆవేదన వ్యక్తం చేశారు.