అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్‌రెడ్డి
కరీంనగర్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 317 జీవో ప్రకారం, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులను స్థానికతను దృష్టిలో ఉంచుకుని వారి సొంత జిల్లాలకు బదిలీ చేసే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పలువురు పట్టభద్రులు, న్యాయవాదులు, పెన్షనర్లను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రులు, నిరుద్యోగులు, ప్రైవేట్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెద్దన్న పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతతి, యువకులకు ఉచిత యాప్ రూపొందించి వారికి సహకారం అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేట్ విద్యాసంస్థల నుండి ఒక విద్యావేత్తగా తాను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని, ప్రైవేట్ యాజమాన్యాల హక్కుల పోరాటానికి, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తానని అన్నారు.