భోపాల్, జనవరి 2: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 1984 డిసెంబర్ 2న ఘోర కలి సంభవించింది. నగర శివారులోని యూనియన్ కార్బైడ్ పురుగు మందు కర్మాగారంలో మిథైల్ ఇసోసైనేట్ అనే విష వాయువు లీక్ అయి రాత్రికి రాత్రే 25 వేల మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 6 లక్షల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ విషాదానికి సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ భోపాల్‌వాసులను వెంటాడుతూనే ఉన్నాయి.
దుర్ఘటన జరిగిన 40 ఏళ్ల తర్వాత కర్మాగారంలో పేరుకున్న 377 టన్నుల విష రసాయన వ్యర్థ పదార్థాలను తరలించే ప్రక్రియకు మోక్షం లభించింది. హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడి ప్రభుత్వం నాలుగు వారాల్లో రసాయన వ్యర్థాల తరలింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది. భోపాల్‌కు 250 కి.మీ దూరంలోని పీతంపూర్ డంప్‌కు తరలించనున్నది.
పూడ్చుతారా..? కాలుస్తారా..?
మున్సిపల్ అధికారులు, కార్మికులు, వైద్యాధికారులు, నిపుణులు పీపీఈ కిట్లు ధరించి గురువారం ఫ్యాక్టరీలోకి ప్రవేశించారు. అత్యంత జాగ్రత్తలు పాటిస్తూ రసాయన వ్యర్థాల నమూనాలు సేకరించారు. ఆ వ్యర్థాలను కాల్చినప్పుడు ఏమైనా ప్రమాదకర వాయువులు విడుదలైతే, డంప్ మొత్తాన్ని పూడ్చి పెడతామని తెలిపారు. మరోవైపు రసాయనాల డంపింగ్‌పై పీతంపూర్ ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2015లో 10 టన్నుల రసాయనాలను పీతంపూర్‌లో పూడ్చిపెట్టారని, దీంతో భూగర్భజలాలు కలుషితం అయ్యాయని గుర్తుచేస్తున్నారు. అధికారులు స్థానికులకు నచ్చజెప్పే ప్రయత్నాలు మొదలు పెట్టారు.