02-03-2025 12:00:00 AM
ఆనాటి అంబులెన్స్
పుర్రెకో బుద్ది.. జిహ్వాకో రుచి అన్నట్టుగా మన పెద్దలు అప్పట్లో ఎన్నో సమస్యలకు తమదైన ఆలోచనలతో పరిష్కారమార్గం చూపారు. ఆకాలంలో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీ లాంటి వాటిలో మోసుకెళ్లి చికిత్స చేయించేవారు. అయితే రూరల్ ఏరియాల్లో మాత్రమే డోలీలు వాడేవారు. పట్టణాల్లో అయితే సైకిల్ లాంటి అంబులెన్స్‌ను ఉపయోగించేవారు. ఇది చూసేందుకు సైకిల్ మాదిరిగా కనిపించినా.. ఐదు చక్రాలతో పొడవాటి డబ్బాతో ఉండేది. ఆ డబ్బాలో రోగిని పడుకోబెట్టి, సైకిల్ తొక్కుతూ ఆస్పత్రికి తరలించేవారు. ఈ ఫొటోలో కనిపించే వాహనం ప్రపంచంలో మొదటి అంబులెన్స్‌గా ఎంతోమందికి సేవలందింది.
ఎడ్లబండికి ఆధారం
మనుషులు లేదా వస్తువులను ఒక చోటి నుంచి మరొక చోటికి చేరవేయడానికి పల్లెల్లో ఎడ్లబండిని బాగా ఉపయోగించేవారు. రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఎడ్లబండి ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు వాడేవారు. ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న ఎడ్లబండ్లకు రబ్బరు టైర్లను వాడుతున్నారు. దాంతో ఎద్దులకు లాగడానికి సులభంగా ఉంటుంది. కాని దీనికి ముందు చెక్కతో చేసిన చక్రాలను వాడేవారు. ఇంకా అభివృద్ధి చెందని మూరుమూల గ్రామాల్లో సరుకులను పట్టణాలకు చేరవేయడానికి ఇంకా ఇలాంటి బండ్లను వాడుతుండటాన్ని తెలంగాణ లో అక్కడక్కడ చూడొచ్చు.