calender_icon.png 13 January, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

12వేల నిర్మాణాలు అగ్గికి ఆహుతి

13-01-2025 01:31:16 AM

* మరో 57వేల నిర్మాణాలకు పొంచి ఉన్న ముప్పు

* లాస్ ఏంజెల్స్‌ను వీడని కార్చిచ్చు

* 16కు చేరిన మరణాల సంఖ్య.. 13 మంది అదృశ్యం

వాషింగ్టన్, జనవరి 12: లాస్ ఏంజెల్స్‌ను కార్చిచ్చు దహిస్తూనే ఉంది. దీని కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 16కు చేరింది. మరో 13 మంది కనిపించకుండాపోయారు. 12వేలకుపైగా నిర్మాణాలు మంటల్లో కాలిపోయాయి. భయంకరమైన గాలుల వల్ల మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వస్తుందని అధికారులు విచారం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మంటలను అదుపు చేసినట్టు చెప్పారు.

లాస్ ఏంజెల్స్‌లోని నాలుగు ప్రదేశాల్లో మంటలు ఇంకా అదుపులోకి రాలేదని పేర్కొన్నారు. పాలిసాడ్స్ ఫైర్‌ను అతిపెద్ద కార్చిచ్చుగా అభివర్ణించిన అధికారులు.. దాన్ని 11శాతం వరకు అదుపు చేసినట్టు చెప్పారు. ఈ ఫైర్ ఇప్పటి వరకు 22వేల ఎకరాలను బుగ్గి చేసిందని తెలిపారు. 426 గృహాలు సహా 5వేల నిర్మాణాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. 

హాలీవుడ్ స్టార్లపై ఆగ్రహం

తమ పరపతితో కొందరు హాలీవుడ్ స్టార్లు లాస్ ఏంజెల్స్‌లో జలాలను ఇష్టారాజ్యంగా వాడుకోవడంతో ప్రస్తుతం నీటి కొరత ఎదురవుతోందని అంతర్జాతీయ మీడియా తన కథనాల్లో పేర్కొంది. నటి కిమ్ కర్దాషఙయన్ ది ఓక్స్‌లోని తన 60 మిలియన్ డాలర్ల ఇంటి చుట్టు తోటను పెంచుకునేందుకు తనకు కేటాయించిన నీరు కంటే 2లక్షల గ్యాలెన్ల నీటిని అధికంగా వాడుకున్నట్టు అధికారులు గుర్తించారు.

సిల్వర్టెర్ స్టాలోన్, కెవిన్ హార్ట్ వంటి వారు అదనంగా నీరు వాడుకుని జరిమానాలు చెల్లించారు. హాలీవుడ్ స్టార్ల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కొందరు హాలీవుడ్ స్టార్ల్లు గంటకు 2వేల డాలర్లు చెల్లించి ప్రైవేటు ఫైర్ ఫైటర్లను నియమించుకున్నారు. 

మరో 57వేల నిర్మాణాలకు ముప్పు

కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 12వేల నిర్మాణాలు శిథిలమయ్యాయి. మరో 57వేల నిర్మాణా లకు కార్చిచ్చు ముప్పు ఉన్నట్టు తెలుస్తుంది. కార్చిచ్చు కారణంగా దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు మరో 1.53లక్షల మందిని వెంటనే ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. అదనంగా మరో 1.66లక్షల మందిని అధికారులు అప్రమత్తం చేశారు.