శ్రీరామోజు హరగోపాల్ :
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని పురాతన చారిత్రక గ్రామం ముదిమాణిక్యం. తేదీ లేని కాకతీయ గణపతి దేవుని శాసనం ముదిమాణిక్యంలోని భోగీశ్వర దేవాలయ ప్రాంగణంలో ఉంది. ఈ శాసనంలో ‘గణపతిదేవుని పాలనాకాలంలో ఇటుకాల చెరువు ప్రదక్షిణం చేసిన భోగనాథ దేవరకు రాయభగవ నారాయణ 1మర్తురు భూమిని ఆ చెరువు సమీపాన దానం చేసా’రని పేర్కొనబడ్డది. మరొక శాసనం అదే దేవాలయ ప్రాంగణంలో ఉం ది.
‘విఖ్యాతుడైన ఎల్లులెంక వంశంలో పుట్టిన ఎఱ్ఱపోత, భార్య మల్లాంబల సంతానం మల్లిసెట్టి అతని అగ్రజుని కొడుకు వాసులెంక క్రీ.శ.1336 జూలై 14న వేయించిన ఈ శాసనంలో కరత్న గ్రామ పడుమట.. (అసంపూర్ణం) అని, శాసనం మరొక పక్క భూరిదానచతురుడని మల్లిసెట్టి కీర్తించ’బడ్డాడు. ఈశ్వరార్య కొడుకైన మాధవసూరి శాసనాన్ని రచించాడు.
అదే దేవాలయ ప్రాంగణంలో అచ్చవని ఇంకొక శాసనం విడివిగ్రహాల వెనక నిలబెట్టి వుంది. ముదిమాణిక్యం పేరు పూర్వం ఏమైవుండేదో కాని వాసులెంక శాసనంలో శ్వేతగ్రామం, కరత్న గ్రామాల పేర్లు రెండు ప్రస్తావించబడ్డాయి. కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు వేముగంటి మురళీకృష్ణ, మఠం వినోద్ కుమార్, నేను ముదిమాణిక్యం గ్రామంలోని భోగీశ్వర దేవాలయాన్ని దర్శించినపుడు ఆ దేవాలయ ప్రాంగణంలో ఉత్తరంవైపు విడిశిల్పాలెన్నో పక్కన పెట్టి కనిపించాయి.
శాసనాలు కూడా వాటిలోనే ఉన్నాయి. రాష్ట్రకూటకాలానికి చెందిన పాతదేవాలయ ద్వారబంధాలున్నాయి. విరిగిన కేశవస్వామి విగ్రహం, పదులసంఖ్యలో రాష్ట్రకూట, చాళుక్యశైలుల నాగశిలలు, ప్రత్యేకమైన వీరగల్లులున్నాయి. వాటిలో ప్రత్యేకంగా కనిపించే శిల్పం భైరవునిది. అడుగున్నర ఎత్తున్న ఈ శిల్పంలో ద్విభంగిమలో, వైతస్థిక పాదభంగిమలో నిల్చున్న భైరవుడు చతుర్భుజుడు. ఢమరుకం, త్రిశూలం, ఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులతో కనిపిస్తున్నాడు. ఎడమవైపు శునకం, కుడివైపు మద్దెల వాద్యకారుడున్నారు. మోకాళ్ళ వద్ద సర్పబంధనముంది. ఈ భైరవుడు తాంత్రిక భైరవుడే.
పశ్చిమాభిముఖంగా ఉన్న దేవాలయం సగం నేలలోపలికి దిగిపోయివుంది. లోపల 16 స్తంభాల అర్థమంటపం (చుట్టు గోడలతో మూసి) వుంది. మంటపంలో గర్భగుడి ముందొకటి, మంటపం చివర మరొకటి నందులున్నాయి. పెద్దమువ్వల పట్టీలతో చిన్న చాళుక్య శైలి నంది ఉన్నది. పెద్దనంది పెద్దమువ్వలు, గంటతో ఒక పట్టీ గంగడోలు మీద వుంది. ఇది రాష్ట్రకూటశైలి నంది. తొలినాళ్ళ చాళుక్యశైలి, రాష్ట్రకూటశైలుల సమ్మేళనం అనిపించే నిరాలంకారంగా ఉన్న ద్వారబంధంపై కుండీలవంటి కలశాలున్నాయి.
లలాటబింబం లేదు. అంతరాళం లేదు. గర్భగుడిలో క్షితిజసమాంతరంగా ఉన్న చతురస్రాకార పానవట్టంలో ప్రతిష్టించిన అడుగుకు తక్కువ ఎత్తుగావున్న అండాకార శివలింగం ఉన్నది. లింగం వెనక మూలన అమ్మవారుగా పూజింపబడుతున్న శిల్పం వుంది. ఈ విగ్రహం ద్విభుజి. అర్ధనగ్న. అర్ధపద్మాసనస్థిత యైన ఈ మూర్తి తపస్సు చేస్తున్నట్టుగా చిన్ముద్ర ధరించి కూర్చున్నది. జటామకుటంతో, పత్రపూరకాలతో, కంఠాన హారంతో కనిపిస్తున్న స్త్రీమూర్తి తపస్సు చేస్తున్న పార్వతి అనిపిస్తున్నది. ఇటువంటి మూర్తి ప్రతిమాలక్షణాలు దుర్లభ్యం.
ఈ గుడిలోనే వాయవ్య దిశలో చిన్న ఉపాలయం వుంది. అందులో దశావతారతోరణాలతో రెండు కేశవమూర్తి విగ్రహాలున్నాయి. గోడలోనే పెట్టికట్టిన వైష్ణవ ద్వార పాలకుని శిల్పముంది. ఒక కేశవమూర్తి అధిష్టానపీఠం సూర్యుని రథసారథి అనూరుడు సప్తాశ్వాలు చెక్కివున్న శిల్పం. ఈ శిల్పాలను బట్టి ఆదిత్యుడు, కేశవుడు, శివలింగాలతో త్రికూటాలయం వుండి వుండాలి. లేదా వేరు, వేరు దేవాలయాలైనా ఉండాలి. ఇపుడు మిగిలి ఉన్నది ఈ గుడొకటే. ఆధారంగా చెప్పడానికి రెండు శాసనాలున్నాయి. కాలానుగుణమైన పరిణామాలతో ఈ ఊరి చరిత్ర పలుసార్లు మార్పులకు గురైందని చెప్పవచ్చు.