సంతాప సభలో వక్తలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 5 (విజయక్రాంతి): ఆదివాసీలపై ప్రభుత్వాల దాడులను అడ్డుకోవడమే ప్రొఫెసర్ సాయిబాబాకు అర్పించే నిజమైన నివాళి అని, ఆయన మరణానికి రాజ్యమే కారణమని ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కాశీం అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ జాస్పర్ హాల్‌లో పరిశోధక విద్యార్థి ఆజాద్ అధ్యక్షత జరిగిన ప్రొ.సాయిబాబా సంతాప సభలో వారు ముఖ్య వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాయిబాబా స్ఫూర్తి తో ఉపా చట్టం రద్దు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
90 శాతం అంగవైకల్యం కలిగిన ప్రొ.సాయిబాబాను ప్రభుత్వం ఎందుకు పదేళ్లు నిర్బంధించిందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. దోపిడీ లేని సమాజం కోసం కలలు గన్న ఆయనను ప్రభుత్వం నిర్బంధించిందని ఆరోపించారు. జైళ్లలో రాజకీయ ఖైదీల కోసం, కులవివక్షకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని గుర్తు చేశారు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టి అనారోగ్యానికి గురయ్యేలా చేశారన్నారు. కార్యక్రమంలో ప్రొ.గడ్డం లక్ష్మణ్, ప్రొ. కొండా నాగేశ్వరరావు, ప్రొ. ఆమంచి నాగేశ్వరరావు, సాయిబాబా కూతురు మంజీర, తమ్ముడు రాందేవ్, విద్యార్థి సంఘాల నాయకులు వరంగల్ రవి, శరత్‌చమర్, సత్య, సునీల్‌శెట్టి, రవినాయక్, ఎస్ నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.