29-03-2025 02:26:10 AM
50 పరుగుల తేడాతో చెన్నై ఓటమి
రాణించిన పటీదార్.. బౌలర్ల సమిష్టి ప్రదర్శన
నేడు గుజరాత్‌తో ముంబై అమీతుమీ
చెన్నై, మార్చి 28: ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 50 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయాన్ని అందుకుంది. చెపాక్ స్టేడియంలో ఆర్సీబీ 17 ఏళ్ల తర్వాత గెలుపొందడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. రజత్ పటీదార్ (52) అర్థసెంచరీతో రాణించగా.. సాల్ట్ (32), కోహ్లీ (31) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 3, పతిరానా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 14౬ పరుగులు చేసి ఓటమిపాలైంది. రచిన్ రవీంద్ర (41) టాప్ స్కోరర్. చివర్లో ధోనీ (30 నాటౌట్) తన ఇన్నింగ్స్‌తో అలరించాడు. బెంగళూరు బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ 3, యశ్ దయాల్, లివింగ్‌స్టోన్ చెరో 2 వికెట్లు తీశారు. నేడు జరగనున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.