* కేజ్రీవాల్ ఎన్నికల హామీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు హామీల వర్షం కురిపించారు. తామ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతినెలా రూ.2,100 ఆర్థికసాయం అంది స్తామని ప్రకటించారు. ‘మహిళల నగదుబదిలీ పథకానికి గురువారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరో 15 రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించే ఛాన్స్ఉన్న నేపథ్యంలో డబ్బులను మహిళల ఖాతాలకు బదిలీ చేయడం ఇప్పుడు సాధ్యపడదు. ముందుగా మహిళలకు నెలకు వెయ్యి ఇవ్వాలని నిర్ణయించాం. పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా ఈ డబ్బులు సరిపోవని కొందరు మహిళలు నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే ఈ మొత్తాన్ని రూ.2,100కు పెంచుతున్నాం. శుక్రవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. కాగా ఇటీవల ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల వరకు లైఫ్ ఇన్యూరెన్స్ ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు.