ఎన్నికల రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించిన ఎనిమిది నెలల తర్వాత తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆదివా రం విల్లుపురం జిల్లాలో పార్టీ తొలి మహానాడు వేదికపైనుంచి తన పార్టీ సిద్ధాంతాలను, భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని స్పష్టంగా ప్రకటించారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని దాదాపు దశాబ్దకాలంగా తమిళనాట ఊహాగానాలు కొనసాగుతూ వచ్చాయి. ఈ ఊహాగానాలకు తెరదించు తూ ఈ ఏడాది ఫిబ్రవరి 2న విజయ్ రాజకీయ రంగప్రవేశం చేశారు. ‘తమిళ వెట్రి కజగం’(టీవీకే) పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన ఆగస్టు 22న పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. మూడు వారాల్లోపే టీవీకేను భారత ఎన్నికల సంఘం గుర్తించినట్లు ప్రకటించడంతో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన లాంఛనాలన్నిటినీ పూర్తి చేసుకున్నారు. పార్టీ ఆవిష్కరణ సమయంలోనే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే తన లక్ష్యమని కూడా ప్రకటించిన విజయ్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంపై ఇన్ని రోజులు దృష్టిపెట్టారు. అందుకే తొలి మహానాడుకు విజయ్ అభిమానులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన అభిమానులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది.ఈ సభలో రాజకీయాల్లో తన మార్గా న్ని స్పష్టం చేసిన విజయ్ మతం, భాష అంటూ ప్రజల్ని చీల్చి రాజకీయం చేసే శక్తులు, ద్రవిడ నమూనా అంటూ రాష్ట్రాన్ని దోచుకొంటున్న అవినీతిపరులే తమ పార్టీకి ప్రధాన శత్రువులంటూ పరోక్షంగా బీజేపీ, డీఎంకే లపై వాగ్బాణాలు ఎక్కుపెట్టారు. సొంతంగానే అధికారంలోకి వస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే తమతో కలిసి వచ్చే భాగస్వాములను అధికారంలో భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు. ఎంజీఆర్, ఎన్టీఆర్‌లే స్ఫూర్తి అంటూ అందరూ సమానమని చాటే కొత్త రాజకీయాలను తమిళనాడులో చూస్తారన్నారు. తనకు రాజకీయ అనుభవం లేదని, అయినా నిలదొక్కుకుంటానంటూ ప్రత్యర్థులకు పరోక్ష హెచ్చరిక కూడా చేశారు.
నటుడిగా ఉచ్ఛస్థితిలో ఉన్న సమయంలోనే ఆ రంగాన్నివదిలిపెట్టి రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా ‘దళపతి’ విజయ్ పెద్ద సాహసమే చేశారు.50 ఏళ్లు కూడా నిండని అతనికి సినీరంగంలో మరో దశాబ్ద కాలం అవకాశాలు కొనసాగేవి. కానీ రాజకీయాల్లోకి రావాలని కొంత కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అయ్యారు. ఇక తమిళనాడు రాజకీయాలకు, సినీ రంగానికి అవినావాభావ సంబంధం ఉంది. ముఖ్యమంత్రులుగా పని చేసిన అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత అందరూ కూడా సినీ రంగంనుంచి వచ్చి రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వారే. అలాగని సినీ రంగంనుంచి రాజకీయాల్లోకి వచ్చిన అందరూ రాణించారనీ చెప్పలేము. విజయ్‌కాంత్, శరత్ కుమార్ లాంటి వారు పార్టీలు పెట్టినా రాణిం చలేకపోయారు. శివాజీగణేశన్ లాంటి మహానటుడు సైతం ఓ దశలో రాజకీయాల్లోకి రావాలని భావించినా ఆ తర్వాత విరమించుకున్నారు. ఇక కమలహాసన్ ఇప్పటికీ తమిళ రాజకీయాల్లో నిలదొక్కుకోలేపోతు న్నారు. ఈ నేపథ్యంలో మరో నటుడు పార్టీ పెట్టడమే కాకుండా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించడం సాహసమే. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వ్యవస్థాగతంగా ఎంతో బలంగా ఉన్నాయి. మరోవైపు దక్షిణాదిన బలపడాలని భావిస్తున్న బీజేపీ అన్నామలై లాంటి డైనమిక్ లీడర్ నేతృత్వంలో తమిళనాడులో కాలూనడానికి ఇటీవలి పార్లమెంటు ఎన్నికలో శతవిధాలా ప్రయత్నించి విఫలమయింది. ఇక ‘ద్రవిడ’ పేరు పెట్టుకున్న మరో అరడజను పార్టీలు కూడా ఉన్నాయి. మరి ఈ సవాళ్లన్నిటినీ అధిగమించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న విజయ్ దానికి తగిన వ్యూహంతో ముందుకెళ్తారనే భావించాలి.