హైదరాబాద్: తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు(Duddilla Sridhar Babu) నేతృత్వంలోని తెలంగాణ ప్రతినిధి బృందం సింగపూర్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (ఎస్‌ఎస్‌ఐఏ)తో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి సెమీకండక్టర్ పరిశ్రమ(Semiconductor industry) అభివృద్ధికి తెలంగాణలో ఉన్న అవకాశాలను వివరించింది. రాష్ట్రంలో పెట్టుబడి(Investment) అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఎస్ఐఏ ఛైర్మన్ బ్రియాన్ టాన్(SSIA Chairman Brian Tan), ఎస్ఎస్ఐఏ వైస్ ఛైర్మన్ టాన్ యూ కాంగ్ పాల్గొన్నారు. ఎస్ఎస్ఐఏ ప్రతినిధులను శ్రీధర్ బాబు రాష్ట్రానికి ఆహ్వానించారు. శ్రీధర్ బాబు(Sridhar Babu) ఆహ్వానంపై ఎస్ఎస్ఐఏ(SSIA) ప్రతినిదులు సానుకూలంగా స్పందించారు. ఈ ఏడాది చివర్లో హైదరాబాద్ వస్తామని ఎస్ఎస్ఐఏ ప్రతినిధులు తెలిపారు.
రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Telangana Chief Minister Revanth Reddy) జనవరి 16 నుంచి 19 వరకు సింగపూర్, జనవరి 20 నుంచి 22 వరకు దావోస్‌లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికారిక బృందం పర్యటించనుంది. పరిశ్రమలు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ బృందంలో పాల్గొంటారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(World Economic Forum in Davos) వార్షిక సమావేశంలో పాల్గొనే ముందు ప్రతినిధి బృందం సింగపూర్‌లో స్కిల్ యూనివర్సిటీ, ఇతర పెట్టుబడి సంబంధిత ఒప్పందాలకు సంబంధించి చర్చలు జరుపుతుంది.
సోమవారం పరిశ్రమల శాఖ మంత్రి, అధికారులతో జరిగిన సమావేశంలో సింగపూర్(Singapore), దావోస్ పర్యటనలో ప్రపంచ పరిశ్రమల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో నిర్వహించే సదస్సులు, సమావేశాలకు హాజరయ్యే ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దేశంలోనే ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానంగా నిలిచిందని, తయారీ, సేవారంగాల్లో దిగ్గజాలను ఆకర్షిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. దేశంలోనే కాకుండా విదేశాల్లోని పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాష్ట్రప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించిందని, హైదరాబాద్(Hyderabad)ను ప్రపంచ వేదికపై ప్రమోట్ చేయడానికి భారీ పెట్టుబడులను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.