రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ, నవంబర్ 28: చెన్నైలోని సమీకృత రైలుపెట్టెల తయారీ కర్మాగా రం (ఐసీఎఫ్)లో గంటకు 280 కిలోమీటర్ల వేగంగా దూసుకెళ్లే హైస్పీడ్ రైళ్లను సిద్ధం చేయిస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ రైళ్లలోని ఒక్కో పెట్టె తయారీకి సుమారు 28 కోట్లు ఖర్చవుతుందని లోక్‌సభకు ఆయ న లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ‘మేక్ ఇన్ ఇండియా ద్వారా రూపొందించిన వందేభారత్ రైళ్లు విజయవం తం కావడంతో హైస్పీడ్ రైళ్ల తయారీపై దృష్టి కేంద్రీకరించాం.
మెరుగైన ఏసీ, వెలుతురు లభించేలా చైర్‌కార్‌లతో ఈ రైళ్లను రూపొందిస్తున్నాం. ఆటోమెటిక్ తలుపులు, చార్జింగ్ సదుపాయం, ఫైర్‌సెఫ్టీ తదితర మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నాం. పూర్తి నమూనా ఖరారయ్యాక ఈ రైళ్లు ఎప్పడు అందుబాటు లోకి వస్తాయో తెలుస్తోంది’ అని మంత్రి పేర్కొన్నారు. కాగా ముంబాయి హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, సముద్రగర్భంలో 21 కిలోమీటర్ల సొరంగం పనులు కూడా ప్రారంభమయ్యాయని వైష్ణవ్ వెల్లడించారు.