calender_icon.png 6 March, 2025 | 5:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టార్గెట్ పూర్తి చేస్తారా..

06-03-2025 01:17:19 AM

కేసు నమోదు చేయమంటారా?

మద్యం దుకాణాలకు ఎక్సుజ్ శాఖ అల్టిమేటం 

అమ్మకాలు తగ్గాయంటున్న మద్యం వ్యాపారులు

కరీంనగర్, మార్చి 5 (విజయక్రాంతి): మార్చి నెల వచ్చిందంటే మద్యం వ్యాపారులకు టార్గెట్ల భయం వెంటాడుతుంది. గత ఎక్సుజ్ సంవత్సరంలో అమ్మిన దానికంటే పది శాతం ఎక్కువ అమ్మకాలు చేయాలని, డిపోల నుంచి మధ్యం లిఫ్టు చేయాలని టార్గెట్లు నిర్ణయిస్తుండడంతో కరీంనగర్ జిల్లాలో మద్యం వ్యాపారులు లబోదిబోమంటున్నారు. ఒక నెలలో 10 లక్షలు ఉన్న మద్యం దుకాణానికి మరో లక్ష పెంచాలని, ఇలా దుకాణాలనుబట్టి పదిశాతం పెంచాలని అల్టీమేటం జారీ చేశారు. మీరు టార్గెట్ రీ కాకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 270 మద్యం దుకాణాలు ఉండగా, కరీంనగర్ జిల్లాలో 94 మద్యం దుకాణాలున్నాయి. రియల్ ఎస్టేట్ పడిపోవడం, గంజాయి అమ్మకాలు పెరగడంతో మద్యం అమ్మకాలు తగ్గాయని వ్యాపారులు అంటున్నారు. దీనికితోడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఫిబ్రవరి 25 సాయంత్రం నుంచి 27 సాయంత్రం వరకు, కౌంటింగ్ సందర్భంగా మార్చి 3 నుంచి 5 వరకు మూడు రోజులపాటు దుకాణాలు బంద్ కావడంతో మద్యం వ్యాపారులు ఇటు అమ్మకాలు లేక, వరుస బంద్ లతో టార్గెట్ ను రీ అవ్వడం ఎలా అని తలలు పట్టుకుంటున్నారు.

బెల్టు షాపుల్లో కూడా అమ్మకాలు తగ్గడం, రిటైల్ అమ్మకాలు తగ్గడంతో టార్గెట్ దాటడం అటుంచితే టార్గెట్ లోపు కూడా అమ్మకాలు అయ్యే పరిస్థితి లేదని అంటున్నారు. ఇవేవి పరిశీలించని ఎక్సుజ్ అధికారులు అమ్ముతారా.. చస్తారా, తాగిస్తారా.. తాగుతారా మీ ఇష్టం, మా టార్గెట్ నింపవలసిందేనని ప్రతిరోజు ఫోన్ చేస్తూ వ్యాపారులపై ఒత్తిడి పెంచుతున్నారు. వివిధ కారణాల చేత ఈసారి అమ్మకాలు పడిపోవడంతో వ్యాపారులు సమావేశమై ఈ ఒత్తిడి నుండి కాపాడాలని ప్రభుత్వానికి విన్నవించుకునేందుకు సిద్ధమవుతున్నారు.