calender_icon.png 14 March, 2025 | 2:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా వర్క్‌షాప్‌లో న్యాయ నిపుణులు

22-12-2024 01:19:36 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (వియక్రాంతి): మాస్టర్ ప్లాన్‌లో ప్రజావసరాలకు ఉద్ధ్దేశించిన 30 శాతం స్థలం దుర్వినియోగం చేసినా, అనుమతి పొందిన లేఅవుట్‌ను అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినా, ఆ నిర్మాణాలను చట్ట ప్రకారం కూల్చివేయవచ్చని న్యాయనిపుణులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు సూచించారు. హెచ్‌ఎండీఏ పరిధిలో గ్రామాలు చేరినప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ గ్రామ పంచాయితీ లేఅవుట్‌లు చెల్లవని వారు స్పష్టం చేశారు.

చెరువుల పరిరక్షణ, పునరుజ్జీవనానికి కృషిచేస్తున్న హైడ్రాకు తగిన న్యాయ సలహాలు అందించి నిరంతరం అండగా ఉంటామని వెల్లడించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు రహదారులు, పార్కులు కబ్జాలకు పాల్పడే వారిపై న్యాయపరమైన అంశాల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై ట్యాంక్‌బండ్ బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ అధ్యక్షతన శనివారం న్యాయవాదుల, రిటైర్డ్ అధికారుల సదస్సు జరిగింది.

ఈ సదస్సులో హైకోర్టు సీనియర్ న్యాయవాది రేసు మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ, హైడ్రా హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కే రవీందర్ రెడ్డి, సీహెచ్ జయకృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ శ్రీనివాసరావు, సీసీఎల్‌ఏ రిటైర్డ్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బీ మధుసూధన్ పాల్గొని సూచనలు చేశారు. చెరువుల పునరుద్ధ్దరణ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, అనుమతి లేని లేఅవుట్లలో ఇంటి స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేని వ్యవస్థ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణకు సంబంధించిన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని వారు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు పర్యావరణంతో కూడిన జీవనాన్ని అందించడానికి హైడ్రా ప్రభుత్వ శాఖల మధ్య చేస్తున్న సమన్వయం అభినందనీయం అని కొనియాడారు.