25-02-2025 12:00:00 AM
కేంద్ర, రాష్ట్ర నాయకుల మాటలతో ప్రజలలో అయోమయం నెలకొంటున్నది. ఒకరికొకరు పొంతన లేని ఉపన్యాసాలతో అనవసర గందరగోళం సృష్టిస్తున్నారే తప్ప, నిర్మాణాత్మక విమర్శలు చేయడం లేదు. ‘రేవంత్ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం కాపాడుతుందని, కేంద్రంలో కయ్యం రాష్ట్రంలో స్నేహం చేస్తున్నదని’ మాజీ మంత్రులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ‘శాసనమండలి ఎన్నికల తర్వాత పోరుబాట అంటుండడంతో కాంగ్రెస్, బీఆరెస్ ప్రభుత్వాలకు తేడా లేదంటూ కేంద్ర మంత్రులు ప్రజలను ఆకర్షిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలోని ప్రజలకు ఇస్తున్నారని, వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అని పేరు పెడితే నిధులను నిలిపివేస్తామని కేంద్రమంత్రులు అంటున్నారు. ఈ గొడవల్లో ప్రజలకు దక్కాల్సిన సంక్షేమ పథకాలు అందకుండా పోయే ప్రమాదం ఉందేమోనని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం పేద, బడుగు, బలహీన వర్గాల వారిని పావులుగా వాడుకోవద్దని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు ఎన్నికలలో ఓడి పోవడానికి కారణాలను వదిలేసి, ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలే తప్పు చేశారన్నట్లు మాట్లాడటం విచిత్రం. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వేగం, శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల అభివృద్ధి ద్వారా ప్రజలూ అన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతున్నారు.
నాయకులు మాత్రం తాము ఏం చేసినా చెల్లాలన్నట్లుగా మాట్లాడటం తగదు. గత ముఖ్యమంత్రి ప్రధానమంత్రిపై చేసిన ఆరోపణలను ముఖ్యంగా ఈ జన్మలో కాదు, ఎన్ని జన్మలెత్తినా ఢిల్లీలో అధికారంలోకి రాలేరనడం, అహంకారంతో మాట్లాడటం వల్ల ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మనందరికీ తెలిసిందే. మన దేశం ప్రజాస్వామ్య దేశాలన్నింటిలో ఎంతో విశిష్టమైంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల పాత్ర ఎంతో కీలకం. అధికార పార్టీ చేసిన మంచి పనులను మెచ్చుకోవడం, వారు ఏదైనా తప్పులు చేస్తే విమర్శించడం చేయాలి.
అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రజల సంక్షేమ పథకాల విషయంలో సలహాలు సూచనలు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిపక్ష నాయకులు పాలక వర్గాలు చేస్తున్న ప్రతి విషయాన్ని గుడ్డిగా విమర్శించడం మానుకోవాలి. వీలైతే, అధికార పార్టీ నాయకులకు సలహాలు, సూచనలు చేయాలి. తద్వారా మన దేశంలోనే రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని ప్రజలు కోరుతున్నారు.
- డా. ఎస్. విజయభాస్కర్