ఘజియాబాద్‌లో జడ్జి, లాయర్లు ఘర్షణ
న్యాయవాదులపై పోలీసుల లాఠీచార్జి
పోలీస్ ఔట్‌పోస్టుకు నిప్పు పెట్టిన లాయర్లు
లక్నో, అక్టోబర్ 29: న్యాయమూర్తి, న్యాయవాదుల మధ్య ఏర్పడిన అభిప్రాయ బేధాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. దీంతో కోర్టులోనే న్యాయవాదులపై పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. జితేంద్రసింగ్, అభిషేక్ యాదవ్ అనే న్యాయవాదులు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి అనిల్‌కుమార్‌ను ఓ బెయిల్ పిటిషన్‌ను వెంటనే విచారించాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులను పిలిపించిన జడ్జి.. కోర్టు రూం నుంచి ఆందోళన చేస్తున్న న్యాయవాదులను బయటకు పంపాలని ఆదేశించారు. లాయర్లను నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారు తిరగబడ్డారు. దీంతో పోలీసులు లాఠీచార్జి చేసి లాయర్లను చెదరగొట్టారు.