* 7 నెలల కనిష్ఠస్థాయికి స్టాక్ సూచీలు
* సెన్సెక్స్ 1,235 పాయింట్లు డౌన్
* 23,100 దిగువకు నిఫ్టీ
ముంబై, జనవరి 21: అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకునే టారీఫ్ నిర్ణయాలు, ఇమ్మిగ్రేషన్ చర్యల పట్ల ఇన్వెస్టర్లలో ఆందోళన తలెత్తడంతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది. ఈ ఒక్కరోజులనే రూ.7 లక్షల కోట్లకుపైగా ఇన్వెస్టర్ల సంపద కరిగిపోయింది. సెన్సెక్స్ 1,235 పాయింట్లు పతనమై 7 నెలల కనిష్ఠస్థాయి 75,838 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచి 1,431 పాయింట్లు క్షీణించి 75,641 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకింది.
ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇంట్రాడేలో 22,976 పాయింట్ల కనిష్ఠస్థాయిని తాకిన అనంతరం 320 పాయింట్ల నష్టంతో 23,024 పాయింట్ల వద్ద నిలిచింది. 2024 జూన్ 6 తర్వాత ఈ స్థాయిలో నిఫ్టీ ముగియడం ఇదే ప్రధమం. హెవీవెయిట్ షే ర్లు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు స్టాక్ సూచీలను బాగా దెబ్బతీసాయి. బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మా ర్కెట్ విలువ ఒక్కరోజులోనే రూ.7,52,520 కోట్లు తగ్గి రూ.4,24,07,205 కోట్ల వద్ద (4.90 ట్రిలియన్ డాలర్లు) నిలిచింది.
ప్రమాణ స్వీకారోత్సవం రోజున పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దిగుమతులపై టారీఫ్‌లను ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నదని, దీనితో దేశీయ స్టాక్స్‌లోనూ అమ్మకాలు వెల్లువెత్తాయని విశ్లేషకులు వివరించారు. కార్పొరేట్ల క్యూ3 ఫలి తాలు నిరుత్సాహకరంగా ఉండటం, రూపా యి క్షీణతలతో విదేశీ ఈక్విటీ పెట్టుబడులు తరలివెళుతున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. బీఎస్‌ఈలో ట్రేడయిన షేర్లలో 2,788 స్టాక్స్ క్షీణించగా, 1,187 స్టాక్స్ పెరిగాయి.
జొమాటో టాప్ లూజర్
జొమాటో వెల్లడించిన ఫలితాలు నిరుత్సాహం కల్గించడంతో సెన్సెక్స్ ప్యాక్‌లోఈ షేరు అత్యధికంగా 11శాతం పతనమయ్యింది. ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్‌లు 4 శాతం వరకూ తగ్గాయి. అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రమే లాభాలతో ముగిసాయి.
వివిధ రంగాల సూచీల్లో అధికంగా రియల్టీ ఇండెక్స్ 4.22 శాతం తగ్గింది. కన్జూమర్ డ్యూరబుల్స్ సూచి 3.99 శాతం, సర్వీసెస్ ఇండెక్స్ 2.86 శాతం, పవర్ ఇండెక్స్ 2.63 శాతం టెలికమ్యూనికేషన్ సూచి 2.52 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 2.35 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 1.94 శాతం చొప్పున పడిపోయాయి.
ట్రంప్ ప్రసంగంతో పెరిగిన భయాలు
కొద్ది ట్రేడింగ్ సెషన్లుగా జాగ్రత్తగా కదులుతున్న మార్కెట్లు ప్రమాణ స్వీకారోత్స వం తర్వాత యూఎస్ కొత్త ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంతో మంగళవారం ఒక్కసారిగా తీవ్ర అమ్మకాల ఒత్తిడి లోనయ్యాయని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే చెప్పారు. అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు భారత్ తో సహా పలు దేశాల ఆర్థికాభివృద్ధి అవకాశాల్ని దెబ్బతీస్తాయన్న అంచనాలు నెలకొ న్నాయని తాప్సే వివరించారు.
ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు భారత్ టెక్నాలజీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని, ప్రమాణ స్వీకారం రోజున ట్రంప్ ఆర్థిక నిర్ణయాలపై స్పష్టత లేనప్పటికీ, ఇమ్మిగ్రేషన్‌పై స్పష్టత ఉన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు.
కెనడా, మెక్సికోలపై 25 శాతం టారీఫ్‌లు ఉంటాయంటూ ట్రంప్ సూచించడం..టారీఫ్ పెం పు విధానాన్ని క్రమేపీ అమలు చేస్తారన్న అంచనాకు రావచ్చని వివరించారు. ట్రంప్ విధానాలతో యూఎస్ బాండ్ ఈల్డ్స్ మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో అమ్మకాల తీవ్రత పెరిగిందన్నారు. ఎడతెగని విదేశీ ఫండ్స్ విక్రయాలు, క్రూడ్ ధరల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించినట్లు ట్రేడర్లు తెలిపారు.
ఎఫ్‌పీఐల భారీ విక్రయాలు
కొద్ది రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడుల్ని వెనక్కు తీసుకుంటున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) మంగళవారం మరింత భారీగా రూ.5,920 కోట్ల నికర విక్రయాలు జరిపినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో జనవరి నెలలో ఇప్పటివరకూ వీరు మార్కెట్ నుంచి వెనక్కుతీసుకున్న పెట్టుబడులు రూ.55,000 కోట్లను మించాయి.
డాలర్ పటిష్టంగా ఉంటూ యూఎస్ బాండ్ ఈల్డ్స్ ఆకర్షణీయమైన రాబడులు ఇస్తున్నంతకాలం ఎఫ్‌పీఐలు భారత్ మార్కెట్లో విక్రయాలు కొనసాగిస్తారని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ చెప్పారు. ప్రస్తుతం డాలర్ ఇండెక్స్ 108 పైన, 10 ఏండ్ల బాండ్ ఈల్డ్ 4.65 శాతం వద్ద ఉన్నాయని తెలిపారు.