calender_icon.png 2 February, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యకు 1.28 లక్షల కోట్లు

02-02-2025 02:07:35 AM

పోయినేడాది రూ. 1.12 లక్షల కోట్లే 

  • గతేడాది కంటే 6.65 శాతం ఎక్కువ కేటాయింపులు కేంద్ర బడ్జెట్‌లో విద్యావ్యవస్థకు పెద్ద పీట
  • మెడికల్ సీట్ల పెంపుకు ఓకే ఐఐటీ పట్నా రూపురేఖలు మార్పు
  • విద్యతో పాటు ఆరోగ్యంపై కూడా ఫోకస్ ఏటికేడు పెరుగుతున్న కేటాయింపులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టిన 2025 కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి పెద్ద పీట వేశారు. రాబోయే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో కొత్త 75వేల సీట్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంతే కాకుండా 2014 తర్వాత ఏర్పాటు చేసిన ఐఐటీల మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని నిర్ణయించారు.  బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఐఐటీ పట్నాలో ఉన్న మౌలిక సదుపాయాలను కూడా మార్చనున్నారు.

అంతే కాకుండా మరింత మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. విద్యారంగంతో పాటు వైద్యరంగం మీద కూడా ఎక్కువ దృష్టి సారించారు. విద్యారంగానికి దేశజీడీపీలో 6 శాతం కేటాయింపులు చేశారు. పోయినేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి రూ. 1.12 లక్షల కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ. 1.28, 650.05 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 6.65 శాతం అధికం కావడం విశేషం. 

పెరుగుతున్న కేటాయింపులు

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. గతేడాది 13 శాతం అధిక నిధులను కేటాయించగా.. ఈ సంవత్సరం బడ్జెట్‌లో విద్యారంగానికి 6.65 శాతం మేర అధిక నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆర్థిక సర్వే సందర్భంగా నిర్మలమ్మ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా ఉన్న 14.72 లక్షల పాఠశాలల్లో 24.8 కోట్ల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 69 శాతం, ప్రైవేటు పాఠశాలల్లో 22.5 శాతం మంది విద్యార్థులు చదువుతున్నారు. 2030 వరకు 100 శాతం మంది పిల్లలు విద్యనభ్యసించేలా చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం’ అని పేర్కొన్నారు. 

చిన్ననాటి నుంచే సాంకేతికతపై అవగాహన

పిల్లలకు పాఠశాల సమయం నుంచే నూతన సాంకేతికత మీద అవగాహన పెంపొందించేలా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యార్థుల కొరకు “భారతీయ భాషా పుస్తక్‌” పథకం తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ పథకం ద్వారా పాఠశాలల్లోని పాఠ్యపుస్తకాలను స్థానిక భాషల్లో డిజిటల్ రూపంలోకి తీసుకురానున్నారు. 

రాబోయే ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నారు. 

“భారత్ నెట్‌” ప్రాజెక్టు కింద దేశంలోని సెకండరీ పాఠశాలల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నారు. విద్యార్థులు మరిన్ని విషయాలు తెలుసుకునేలా, సాంకేతికతను అలవర్చుకునేలా ఇది దోహదపడనుంది. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మీద మరింత పట్టు కోసం రూ. 500 కోట్ల నిధులతో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఇర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

రానున్న ఐదేళ్లలో ఐఐటీ, ఐఐఎస్‌సీల్లో 10 వేల ఫెలోషిప్ పోస్టులను అందుబాటులోకి తేనున్నారు. 

“పీఎం ఇంటర్న్‌షిప్‌” పథకం ద్వారా రానున్న పదేండ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆ పథకాలకే అత్యధికం

నిర్మలమ్మ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో విద్యారంగానికి అత్యధికంగా కేటాయింపులు జరిపారు. సమగ్ర శిక్ష, ప్రధానమంత్రి పోషణ్ శక్తి అభియాన్ (పీఎం పోషణ్) పథకాలకు రూ. 41,250 కోట్లు, రూ. 12,500 కోట్లు కేటాయించారు. ఈ రెండు పథకాలు నేషనల్ ఎడ్యుకేషన్ మిషన్ కింద ఏర్పాటు చేశారు.

ఈ రెండు పథకాలకు పోయినసారి కంటే ఈ సారి ఎక్కువ నిధులు కేటాయించడం గమనార్హం. పీఎం శ్రీ పథకానికి రూ. 7500 కోట్లు కేటాయించారు. పోయిన బడ్జెట్‌లో ఈ పథకానికి కేవలం రూ. 4500 కోట్లతోనే సరిపెట్టారు. 

ఉన్నత విద్యకు అందలం

పెరిగిన కేటాయింపులు
ఉన్నత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి
50 వేల కోట్లు దాటిన నిధులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో ఉన్నత విద్యకు పెద్ద పీట వేశారు. గతేడాదితో పోలిస్తే 7.74 శాతం అధిక కేటాయింపులు జరిపారు. దీంతో ఉన్నత విద్యకు కేటాయించిన మొత్తం  రూ. 50,077.95 కోట్లకు చేరుకుంది. ఇంత భారీ మొత్తంలో ఉన్నత విద్యకు కేటాయింపులు చేయడంపై యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. 


ప్రధాని, మంత్రికి ధన్యవాదాలు

విద్యారంగానికి పెద్ద పీట వేసిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు, ప్రధాని మన్మోహన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి మరింత పెరుగుతుంది. భారత్‌ను నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీగా మార్చేందుకు ఇది దోహదపడుతుంది’.
 ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి