నవ్వును మర్చిపోయా!
నవ్వును మర్చిపోయా..
అవును..
మీరు విన్నది నిజం
నేను నవ్వును
మర్చిపోయా!
చిన్నప్పుడు పగలబడి
నవ్వే నవ్వును
మర్చిపోయా..
అలా పగలబడి
నవ్వితే
కంట్లో నీళ్ళు రాలేవి!
కడుపు పగిలి పోయేది..
అదో అద్భుతమైన నవ్వు..
ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసేది!
మీరు విన్నది నిజం
నేను నవ్వును మర్చిపోయా..
అదో స్వచ్ఛమైన, నిస్వార్థమైన నవ్వు
ఎలాంటి బాదర బంది లేని
సీతాకోక చిలుకలాంటి నవ్వు..
గాల్లో విహరించే నవ్వు..
మీరు విన్నది నిజం
నేను నవ్వును
మర్చిపోయా!
అలా కాలంతోపాటు
నవ్వును మర్చిపోతూ.. మర్చిపోతూ
నవ్వడం మొదలెట్టా..
దాని పేరే ప్లాస్టిక్ నవ్వు
కాలంతో పాటు వచ్చిన
ఈ నవ్వును స్వీకరించడానికీ
చాలా సమయం పట్టింది!
ఈ నవ్వు రుచి..
బోరున ఒక్కసారిగా
ఎక్కి ఎక్కి ఏడిస్తే వచ్చే
కన్నీళ్ళ రుచిని కలిగి ఉన్నది.
ప్లాస్టిక్ నవ్వుతో
మర యంత్రంగా మారినా..
ఈ నవ్వుతో
నా దేహం కదలడం తప్ప
చలనం లేని
నా ముఖంలో
మెల్లి మెల్లిగా జీవాన్ని కొల్పోయా!
నా చిన్నప్పటి
నవ్వు కావాలి
మునుపటి నవ్వు
కావాలి..
పడిపడి నవ్వే నవ్వు కావాలి!
కుళ్ళు, కుతంత్రాలు..
స్వార్థం, ద్వేషం లేని నవ్వు కావాలి!
మర్చిపోయిన
నా బాల్యం నాటి నవ్వు కావాలి!
- రూప