18-04-2025 12:46:17 AM
మునిపల్లి, ఏప్రిల్ 17 :మారుతి సుజుకి కార్లో అక్రమంగా రవాణా చేస్తున్న 110 గ్రాముల ఎండు గంజాయిని మునిపల్లి పోలీసులు గురువారం నాడు కంకోల్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జహీరాబాద్ నుండి హైదరాబాద్ వైపు మారుతి సుజుకి కార్ లో నలుగురు వ్యక్తులు ఎండు గంజాయిని రవాణా చేస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఈ సందర్భంగా జహీరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ మారుతి సుజుకి కార్లో వత్సల్ రామ్ శెట్టి, ఆకాష్, అజయ్ దేశముఖ, సోహెల్ ప్రయాణిస్తుండగా అనుమానం వచ్చి తనిఖీ చేయగా అందులో 110 గ్రాముల ఎండు గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని విచారించగా బీదర్ లోని ఇర్ఫానీ గల్లీలో ఎండు గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్ రవాణా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునిపల్లి ఎస్‌ఐ రాజేష్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎండు గంజాయిని రవాణా చేస్తున్న నలుగురుని పట్టుకోవడంతో పాటు ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడంపై ఎస్‌ఐ రాజేష్ నాయక్ ను సిబ్బంది గోపాల్, అనీఫ్, పాండు, సంతోష్, భవాని, సునీల్ లను కొండాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అభినందించారు.